భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరిగనట్టే పెరిగి తగ్గుముఖం పట్టడంతో పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు రోజులుగా చతీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తాలిపేరుకు భారీగా వరద నీరు చేరుకొంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని కిందికి వదలడంతో గోదావరికి వరద తాకిడి అధికమైంది. భద్రాచలం వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 50.6 అడుగులకు చేరుకుంది. ఆ తర్వాత వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. సాయంత్రం 6 గంటలకు 48.7 అడుగులకు చేరుకుంది. గోదావరి నుంచి 12.5లక్ష క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేశారు.