తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): కస్టమ్ అధికారులు తమ నుంచి నిరుటి ఆగస్టు 12న 2.8 కిలోల బంగారాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ షేక్ ఆరీఫ్, షేక్ మహమ్మద్ సిద్ధిఖీ వేసిన వ్యాజ్యాలను హైకోర్టు డిస్మిస్ చేసింది. చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తమకు అప్పగించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్లను జస్టిస్ సామ్ కోషి, జస్టిస్ తుకారాంజీ డివిజన్ బెంచ్ ఇటీవల కొట్టివేసింది. పిటిషనర్లు బ్యాంకాక్‌లో లీగల్‌గా బంగారాన్ని కొనుగోలు చేశారని, మన దేశానికి వచ్చాక కస్టమ్స్ అధికారులకు తెలియజేయాలని వెళ్తుంటే కస్టమ్స్ అడ్డుకున్నారని పిటిషనర్ల న్యాయవాది చెప్పారు. ఈ వాదనను కస్టమ్స్ అధికారుల న్యాయవాది వ్యతిరేకించారు. పిటిషనర్లపై బంగారం స్మగ్లింగ్ చేస్తారనే ఆరోపణలున్నాయన్నారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించడానికి వాళ్ల దగ్గర నగదు లేదన్నారు. ఈ వాదనను హైకోర్టు ఆమోదించి పిటిషన్లను డిస్మిస్ చేసింది.