- నిర్మించుకోకుంటే సీవరేజ్ పైపులైన్ కట్
- జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గురువారం ఎండీ అశోక్‌రెడ్డి మెహదీపట్నం, లంగర్ హౌస్ ప్రాంతాల్లో డీ-సిల్టింగ్ పనులను పరిశీలించారు. మొదటగా మెహదీ పట్నం అంబా థియేటర్ వద్ద ప్రధాన రహదారిపై తరచూ పొంగుతున్న మ్యాన్ హోళ్లను పరిశీలించారు.
చుట్టు పక్కల ప్రాంతాల్లోని హోటళ్ల యాజమానులు తమ సీవరేజ్ పైపులైన్‌ను నేరుగా జలమండలి సీవరేజ్ నెట్‌వర్క్ కు అనుసంధానం చేయడంతో వాటి నుంచి వచ్చే ఆహార, వ్యర్థ పదార్థాలు మ్యాన్ హోళ్లలో చేరి పొంగినట్లు గమనించారు. దీంతో హోటళ్లు, బేకరీలు, ఫుడ్ కోర్టులు, వాణిజ్య భవనాల యజమానులకు సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోవాలని నోటీసులు జారీ చేయాలని అధికారులను ఎండీ ఆదేశించారు.
నిర్లక్ష్యం వహించిన వారి సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. తర్వాత టోలీచౌకిలో జరుగుతున్న డీ-సిల్టింగ్ పనుల్ని పరిశీలించారు. అక్కడ సీవరేజ్ ఔట్ లెట్ లేని లైన్లను జలమండలి నూతనంగా నిర్మిస్తున్న జోన్-3 సీవరేజ్ నెట్ వర్క్ కు అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
నిర్మాణం దశలో ఉన్న ఈ ప్రాజెక్టులో 3 ప్రాంతాల్లో దాదాపు 2.1 కిలోమీటర్ల మేరకు స్థానిక సమస్యలతో పనులు నిలిచిపోయాయి. స్థానికులు, ప్రజాప్రతినిధులతో చర్చించి పనులు చేపడతామని చెప్పారు. మరో 7 కిలో మీటర్ల మేరకు పైపులైన్ నిర్మాణం పనులను ఫిబ్రవరి లోపల పూర్తి చేయాలని ఆదేశించారు.