calender_icon.png 23 October, 2024 | 3:09 PM

రియల్ కుదేలు

05-05-2024 12:22:21 AM

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. అమ్మకాలు లేక, కొనుగోలుదారులు కానరాక బిల్డర్లు, ప్లాట్ల డెవలపర్లు తలలు పట్టుకొంటున్నారు. కట్టిన ఇండ్లు, అపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉండటం, మరోవైపు అప్పులు, వడ్డీల భారం పెరిగిపోతుండటంతో ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొన్నది. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగినట్టు కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేగా ఉన్నది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 25 శాతం పెరిగింది. కానీ, ఇది గత రెండుమూడేండ్ల క్రితం ప్రారంభించిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన ఆదాయం. సహజంగా ప్రాజెక్టుల ముగింపు సందర్భంగా జరిగే రిజిస్ట్రేషన్ల ఆదాయమే ఇది. క్షేత్రస్థాయిలో బుకింగ్స్, సేల్స్ వేగం చాలా మందగమనంలో ఉన్నది. బిల్డర్లు, ప్లాట్ల డెవలపర్లు తీవ్ర సమస్యల్లో ఉన్నారు. చాలావరకు వాణిజ్య, నివాస గృహాలు అమ్ముడు పోకుండా ఖాళీగా ఉన్నాయి.

భవిష్యత్తులో అమ్మకాలు పెరుగుతాయన్న నమ్మకంతో బిల్డర్లు ఆ ఖాళీ గృహాలకు కూడా బ్యాంకు రుణాలను ఎంచుకొంటున్నారు. ముఖ్యంగా గత ఆరు నెలలుగా కొనుగోలుదారుల కదలికలను గమనిస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై బలంగా ఉంటుందని బిల్డర్లు నమ్ముతున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుంచి రియల్ రంగాన్ని బయటపడేయాలంటే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రత్యేక పథకాలు ప్రకటించాలి. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించాలి. అనుమతులు త్వరగా ఇవ్వాలి. అన్ని అనుమతులు పొందిన లేఔట్లలో అమ్మకాలపై ప్రతి మూడు నెలలకోసారి రెరా తన వెబ్‌సైట్‌లో సమగ్ర వివరాలు పొందరుపర్చాలి. అప్పుడే పరిస్థితి కుదుటపడుతుంది.

ప్రస్తుత కష్టకాలానికి మూడు ప్రధాన కారణాలున్నాయి 

1. డబ్బు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోకి ప్రవహించి, మార్కెట్లో కొరత ఏర్పడటం. 

2. రాష్ట్రంలో ప్రభుత్వం మారటం. 

3. కరువు కారణంగా రైతుల డబ్బు వ్యవసాయంలోనే చిక్కుకు పోవటం. 

ప్రస్తుతం రియల్ రంగంలో సంక్షోభం ఏ స్థాయిలో ఉన్నదంటే.. హైదరాబాద్ నగర శివార్లలో ప్లాట్ల ధరలు మార్కెట్ రేటుకంటే ఏకంగా 30 శాతం తక్కువకు పడిపోయాయి. కొనుగోలుదారులు, డెవలపర్లకు చెందిన లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు ఖాళీగా ఉన్నాయి. ఇది జాతీయ సంపద వృథా కిందకే వస్తుంది. దీనిని వెంటనే సరిచేయాల్సిన అవసరం ఉన్నది. రియల్ ఎస్టేట్ పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. భౌగోళిక, మెట్రోపాలిటన్ పరిస్థితులు, అద్భుతమైన ఐటీ రంగం తదితర అంశాలను అవకాశాలుగా తీసుకొని రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.   

సి. ఎల్. రాజం

చైర్మన్, విజయక్రాంతి