22-02-2025 12:00:00 AM
బ్రిక్‌వర్క్ తాజా నివేదిక వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): దేశంలో ప్యాకేజింగ్ పరిశ్రమ శరవేగంగా పెరుగుతున్న పరిశ్రమల్లో ఒకటి. ఇది వివిధ పరిశ్రమలకు అనుగుణంగా పలు రకాల మెటీరియల్స్, ఫార్మాట్లు, అప్లికేషన్లతో విస్తరించి ఉంది. ఆహారం, బెవరేజెస్, ఫార్మాస్యూటికల్స్, ఈ కామర్స్ లాంటి నలు కీలక రంగా లు తమ ఉత్పత్తుల రక్షణ, బ్రాం డింగ్, వినియోగదారుడి సౌకర్యం కోసం ప్యాకేజింగ్ పరిష్కారాలపై ఆధారపడుతున్నాయి.
2024 ఆర్థిక సంవత్సరం లో భారతీయ ప్యాకేజింగ్ పరిశ్రమ విలువ రూ.6656 బిలియన్ కోట్లుగా అంచనా. 2028 నాటికి ఇది రూ.8,620 బిలియన్ కోట్లకు విస్తరించవచ్చని భావిస్తున్నారు. అంటే ఏటా 6.7 శాతం వృద్ధిని నమోదు చేయనుంది. పెరుగుతున్న ఖర్చు చేసే ఆదాయాలు, పట్టణీకరణ, ప్యాకేజ్డ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు డిమాండ్ పెరగడం, ఈకామర్స్ రంగం మూడు పువ్వులు, ఆరుకాయలుగా ఎదగ డం ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయి.
అంతేకాకుండా ప్రభుత్వం ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఒక కారణం. దేశ ఆర్థిక వ్యవస్థలో అయిదో అతిపెద్ద రంగంగా ఉన్న ప్యాకేజింగ్ పరిశ్రమ నిలకడగా అభివృద్ధిని సాధించడమే కాకుం డా ముఖ్యగాఎగుమతుల మార్కె ట్లో మరింత విస్తరించేందుకు సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొన్ని ఐరోపా ప్రాంతాల్లో ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు మనకన్నా తక్కువ ఉండడం, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి దీనికి కారణం.
దీంతో ఈ రంగంలో పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయమైన కేంద్రంగా మారింది. మన దేశం రకరకాల ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అయితే మిగతా దేశాలతో పోలిస్తే మన దేశ తలసరి ప్యాకింగ్ వినియోగం చాలా తక్కువగా ఉండడంతో రాబోయే సంవత్సరాల్లో ఈ రంగం అభివృద్ధికి బోలె డు అవకాశాలున్నాయి.
అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తో పాటుగా అంతర్జాతీయ మార్కె ట్లో ఒడిదొడుకులు, సరఫరాల్లో కొరత లాంటి వాటి కారణంగా తరచూ ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ రంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. పర్యావరణ ప్రేమికులైన వినియోగదారుల డిమాండ్‌కు తగ్గట్టుగా పరిశ్రామిక వర్గాలు ఖర్చు తక్కువతో కూడిన, పర్యావరణ హితమైన నూతన పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉందని ‘బ్రిక్‌వర్క్ రేటింగ్’ తన తాజా నివేదికలో పేర్కొంది.