calender_icon.png 16 January, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేటను ముంచెత్తిన వాన

05-09-2024 01:31:55 AM

జిల్లాలో మళ్లీ కుండపోత.. లోతట్టు ప్రాంతాలు జలమయం

సిద్దిపేట/హుస్నాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఇక వాన ఆగుతుందని సిద్దిపేట జిల్లా ప్రజలు భావిస్తుండగా మంగళవారం రాత్రి తిరిగి కుండపోత వర్షం కురిసింది. కోహెడ మండలంలో అత్యధికంగా 203.7 మి.మీ, నంగునూరు మండలంలో 140.3 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి నంగునూరు మండలంలోని చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు నిండి అలుగులు దుంకాయి. వాగులు పొంగిపొర్లడంతో శనిగరం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. వరదల కారణంగా శనిగరం, కోహెడ, తంగళ్లపల్లి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

కోహెడ మండలం బస్వాపూర్‌లో వరదలో చిక్కుకున్న ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన ఏనిమిది మంది కూలీలను హుస్నాబాద్ పోలీసులు కాపాడారు. కలెక్టర్ మను చౌదరి కోహెడ మండల కేంద్రంతో పాటు తంగళ్లపల్లి, శనిగరం ముంపు గ్రామాల్లో పర్యటించారు. బాధితులకు అవసరమైన వస్తువులు, సామగ్రి అందించాలని అధికారులను అదేశించారు. వాన బీభత్సానికి ఇప్పటివరకు జిల్లాలో ఒకరు మృతి చెందగా, 92 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

రాకపోకలు బంద్

సంగారెడ్డి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): భారీ వర్షలతో అల్లాదుర్గం రోడ్డు పై మంజీరాపై ఉన్న రాయిపల్లి బ్రిడ్జి వద్ద పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు రాయికోడ్ మండలం సిరూర్ శివారులోని నదిపై ఉన్న రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో మంగళవారం రాత్రి పోలీసులు అటువైపు వాహన రాకపోకలను నిలిపివేశారు. దీంతో వాహనదారులు నారాయణఖేడ్, మెదక్ వైపు వెళ్లే వాహనదారులు మనూర్ వైపు నుంచి వెళుతున్నారు.

161 వ జాతీయ రహదారి సంగారెడ్డి   అకోలా రోడ్డు పక్కన ఉన్న  సర్వీస్ రోడ్లపై వరద నిల్వ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు సింగూర్ ప్రాజెక్టుకు వరద పోటు కొనసాగుతూనే ఉన్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వస్థాయి 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 26.423 టీఎంసీల నీరు ఉంది. ఇన్‌ఫ్లో 4,4197 క్యూసుక్కులు, ఔట్ ఫ్లో 401 క్యూసెక్కులు ఉంది.

శాంతించిన వరుణుడు...

మెదక్/వెల్దుర్తి/చేగుంట, సెప్టెంబర్ 4(విజయక్రాంతి): వరుణుడు శాంతించడంతో మెదక్ జిల్లాలో వానలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు జనజీవనం అతలాకుతలం అయింది. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, వాగులు ఉప్పొంగాయి. పలుచోట్ల చెరువులు అలుగు పారగా, బంగలు పడి వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరదల ధాటికి సుమారు 20 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.