calender_icon.png 10 October, 2024 | 4:52 PM

కడగండ్లు మిగిల్చిన వాన!

04-09-2024 12:25:23 AM

వరద నుంచి తేరుకున్న హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాలు

పలుచోట్ల కొట్టుకుపోయిన రహదారులు

వందలాది ఎకరాల్లో పంట నష్టం

నష్టాన్ని అంచనా వేసే పనిలో ‘అగ్రి’ అధికారులు

విజయక్రాంతి నెట్‌వర్క్, సెప్టెంబర్ 3: మూడు రోజులుగా వర్షాలతో హైదరాబాద్ మహానగరంతో పాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ముంపుప్రాంతాల్లోకి నీరు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిచోట్ల ఇండ్లలోకి వరద వచ్చి చేరింది. చెరువులు పొంగి కొన్నిచోట్ల కాలనీలు నీటమునిగాయి. సోమవారం వానలు తెరిపివ్వడంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు.

మంగళవారం వరద వెనక్కి వెళ్లిపోవడంతో బాధితులు తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఏకధాటిగా కురిసిన వర్షాలకు మెదక్ జిల్లాలోని చెరువులు, వాగులు, హల్ది ప్రాజెక్టు, ఘణపురం ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల చెరువులకు బుంగలు పడగా అధికారులు వాటిని పూడ్చే పనిలో నిమగ్నమ య్యారు.  ఇరిగేషన్ శాఖ పరిధిలోని ఒక చెరువు, ఒక కెనాల్ దెబ్బతిన్నది. పాపన్నపేట మండలం కొంపల్లిలో ఒక పశువు మృతిచెందగా, జిల్లావ్యాప్తంగా 223 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మూడురోజులుగా కురిసిన వానలకు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మధ్య ఉన్న పెట్రోల్ బంక్ వద్ద రోడ్డుపైకి వరదనీరు ఎక్కువగా వచ్చి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

మున్సిపల్ అధికారులు సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని బెజ్జెంకి మండలంలోని తోటపల్లి గ్రామాస్తుడు సందిరి లక్ష్మణ్ ఆదివారం చేపలు పట్టేందుకు వెళ్లి వాగులో కొట్టుకుపోయాడు. రెండు రోజు ల పాటు పోలీసులు, గజ ఈతగాళ్లు గాలించారు. వాగులో లక్ష్మణ్ మృతదేహాన్ని బయట కు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ మంగళవారం హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు, బస్వాపూర్ పందిల్ల మధ్య మోయతుమ్మెద వాగును సందర్శించారు.

దెబ్బతిన్న రహదారులు..

వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లాలోని 65వ జాతీయ రహదారితో పాటు 161 జాతీయ రహదారి పై ఉన్న సర్వీస్ రోడ్లు పై వరదీనీరు నిల్వ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జహీరాబాద్, పటాన్‌చెరు, సదాశివపేట, ఆం దోల్, నారాయణఖేడ్‌తో పాటు పలు మండలంలో రోడ్లు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోని రోడ్లుకు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. బీదర్ జహీరా బాద్. కంకో ల్ రాయికోడ్, అల్లాదుర్గం, మెటాల్‌కుంట, రాయిపల్లి, నారాయణఖేడ్ రోడ్లతో పాటు పలు రోడ్లు గుంతలుగా మరిపోవడం జరిగింది.

సిరూర్- రాయిపల్లి బ్రిడ్జి పై ఉన్న రోడ్డు ప్రమాదకరంగా మరిపోవడంతో ఆర్‌టీసీ అధికారులు బస్సు సర్వీస్‌లు నిలిపివే శారు. మెదక్ జిల్లాలో తొమ్మిది పంచాయతీరాజ్ రోడ్లు, 11 ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండల పరిధిలోని రాయిపల్లి వద్ద మంజీరాపై ఉన్న వంతెన మార్గం ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాల కారణంగా జహీరాబాద్, రాయికోడ్, ఝరాసంఘం, కప్పాడ్, కంకోల్ ప్రాం తాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వంతెన వద్దకు వెళ్లిన వాహనాలు తిరిగి ఖేడ్ మీదుగా పుల్‌కూర్తి వంతెన నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వికరాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలంలోని పలు ముంపు గ్రామాలను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పరిశీలించారు. వరద బాధితులకు సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మోమిన్‌పేట్ మండలంలోని రాంనాథ్ గుడుపల్లి, గోవిందా పూర్, మల్‌రెడ్డిగూడెం రైతులకు అవసరమైన కల్వర్టులను రెండు మూడు నెలల్లో నిర్మిస్తామని భరోసానిచ్చారు.

పంట నష్టం ఇలా..

వరదల ధాటికి యాదాద్రి జిల్లాలోని బీబీనగర్, భువనగిరి, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో మూసీ పొంగి రైతులు పండిస్తున్న పొలాల్లోకి నీరు చేరింది. దాదాపు 3 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలోని ముంపు ప్రాంతాలను కలెక్టర్ హనుమంతు కే జండగే పరిశీలించారు. భారీ వర్షానికి సంగారెడ్డిలో పత్తి 755 ఎకరాలు, సోయాబీన్ 423 ఎకరాలు, కంది 320 ఎకరాలు, మినుము 150 ఎకరాలు, వరి 150ఎకరాలు, ఇతర పంటలు 155 ఎకరాలు దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 165 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఆయా జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయి లో పర్యటిస్తున్నారు. పంట నష్టంపై సమగ్ర నివేదిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.