calender_icon.png 7 February, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వేశాఖ మొండిపట్టు వీడదా?

10-12-2024 12:00:00 AM

మన దేశంలోని రైల్వేలో గణనీయమైన పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. సింగిల్ లైన్‌ను డబుల్ లైన్లుగా, డబుల్ లైన్‌లను త్రిబుల్ లైన్లుగా మారుస్తున్నారు. ఆధునాతనమైన సాంకేతిక మౌలిక వసతులతో కూడుకున్న స్టేషన్ భవనాలు అప్రతహితంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్యాసింజర్ రైళ్లకు అదనంగా జనరల్ బోగీలను సమకూర్చడం కీలక పరిణామం. ప్రయాణికులకు ఇది కాస్త సంతోషకరమైన విషయమే. కానీ, ఇప్పటికి కూడా రద్దయిన రైళ్లను పునరుద్ధరించక పోవడం శోచనీయం. పాత సమస్యలను అలాగే ఉంచి, కొత్త విషయాలపై రైల్వేశాఖ దృష్టి కేంద్రీకరిస్తున్నది. ప్రజల అవసరాల కోసం రైళ్లను ఆయా స్టేషన్లలో విధిగా ఆపాలని ప్రజలనుంచి అనేక విజ్ఞాపనలు సమర్పిస్తున్నప్పటికినీ అధికారులు పెడచె విన పెట్టడం సమంజసం కాదు.

మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎక్స్‌ప్రెస్ రైళ్ళను కొన్ని స్టేషన్లలో నిలుపుదల చేయాలని కోరడం అదేదో పనికిరాని విషయంగా అధికారులు పరిగణిస్తున్నట్టున్నారు. మూడు మండలాలలోని దాదాపు 30 గ్రామాలకు రైలు సౌకర్యం కలిపిస్తున్న కాజీపేట్ సెక్షన్‌లోని కొలనూరు స్టేషన్‌లో సిర్పూర్ కాగజ్‌నగర్‌కిందరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కరీంనగర్ తిరు పతి ఎక్స్‌ప్రెస్ రైళ్ళను ఆపాలని జనం పలుమార్లు విన్నవించుకున్నారు. అయినా, రైల్వే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఏ మాత్రం పట్టించుకోకపోవడం అన్యాయం.

రైళ్లను ఆపడం అనేది నిరంతర అనివార్య ప్రక్రియ. ఇది ట్రాఫిక్ సమర్థన, కార్యాచరణ  సాధ్యాసాధ్యాలకు లోబడి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇంతేకాక, పార్లమెంటులోనూ సభ్యులు కొన్ని స్టేషన్లో రైళ్ళను ఆపాలని కోరినప్పుడు రైల్వే మంత్రికూడా ఇదే తరహాలో సమాధానం చెప్పడం ఆశ్చర్యకరం. ఒక అరిగిపోయిన గ్రామ్‌ఫొన్ రికార్డు వలె ప్రతిసారీ ఒకే విధమైన సమాధానం కేంద్ర సర్కారు ఇస్తే ఎలా? పోటీ మార్కెట్‌లో నిలబడడానికి రైల్వే వ్యవస్థను ముందుకు తీసుకుపోతున్న విధంగానే ప్రజలు కూడా తక్కువ ఖర్చుతో, ఎక్కువ వేగంతో కూడుకున్న సౌకర్యవంతమైన రవాణా సదుపాయాన్ని ఎంచుకోవడం అన్యాయం కాదుకదా! ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనలను సడలించి అయినా సరే, ఆయా రైళ్ళను ప్రజల సౌకర్యార్థం పైన పేర్కొన్న నిర్దుష్ట స్టేషన్లో ఆపడానికి ఇప్పటికైనా అధి కారులు చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి మొండి వైఖరి పనికిరాదు. స్థానిక బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పట్టించుకొని ఈ విషయంలో ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి.

 దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్