calender_icon.png 23 October, 2024 | 10:58 AM

రెచ్చిపోతున్న రౌడీషీటర్లు

23-09-2024 12:00:00 AM

  1. కొద్దిరోజులుగా సైలెంట్‌గా మళ్లీ దాడులు
  2. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ దందా
  3. మూడు కమిషనరేట్ల పరిధిలో 7,745 మంది నేరస్థులు
  4. రౌడీలపై ఉక్కుపాదం మోపాలని ప్రజల డిమాండ్

తన గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి చేశాడని ఓ యువకుడు కొద్దిరోజుల క్రితం గాజుల రామారంలోని ఓ బార్‌కు వెళ్లి మేనేజర్‌పై కాల్పులకు పాల్పడ్డాడు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు రియల్టర్లను బెదిరించేందుకు తుపాకీ సమకూర్చుకున్నానని చెప్పాడు. అలా బెదిరించి రియల్టర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు చెప్పడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. అలాగే ఇటీవల బాలాపూర్‌లో ప్రత్యర్థుల చేతిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని ఓ వాహనంతో ఢీకొట్టి తుపాకీతో కాల్చి చంపారు.  సీతాఫల్‌మండి, నాంపల్లి, రాజేంద్రనగర్‌లో ఇటీవల పోలీసులు దుండగుల కోసం గాలిస్తుండగా.. దుండగులు పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డారు. ఇలా మహానగర వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట రౌడీషీటర్లు దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు.

- హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) :

కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న రౌడీషీటర్లు మళ్లీ సెటిల్‌మెంట్లకు తెరతీశారు. వ్యకిగత దాడులకు పాల్పడుతున్నారు. సివిల్ పంచాయతీల్లో తలదూరుస్తున్నారు. వీరిలో అమాయక ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడితే.. మరికొందరు సంపన్నులను బెదిరించి డబ్బుదండుకుంటున్నారు. రియ ల్ రంగంలో పెట్టుబడులు, మాదకద్రవ్యాల సరఫరా, నకిలీ నోట్ల చలామాని.. ఇలా అనేక రకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వందల కోట్లు కూడబెడుతున్నారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో 7,745 మంది పాత నేరస్థు లు, రౌడీషీటర్లుగా పోలీసు రికార్డులో నమోదయ్యారు.

వీరిలో ఎక్కువ మంది దశాబ్దాల పాటు సెటిల్‌మెంట్లు చేసి స్థిరాస్తి, హోటల్ రంగాల్లో స్థిరపడిన వారున్నారు. సౌత్, వెస్ట్ జోన్ల పరిధిలో సుమారు 15 మంది రౌడీషీటర్లు రూ.100 కోట్లకు పైగా విలువైన ఆస్తులు కూడబెట్టినట్టు పోలీసు అధికారులే చెబుతున్నారు. బార్లు,  క్లబ్‌లు, స్నూకర్ కేంద్రాలు, హుక్కా సెంటర్లు, వ్యభిచారం, మాదకద్రవ్యాల రవా ణా ఇలా అనేక రకాల దందాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అలాగే వీరు మహానగరంతో పాటు నల్గొం డ, భువనగిరి, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో నెలకొన్న భూ వివాదాల్లోనూ తలదూరుస్తు న్నట్లు సమాచారం. వీరిలో ఎంతోమంది ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రాలేదని, జైలులో పరిచయమైన వారితో కలిసి మళ్లీ ముఠాగా ఏర్పడి.. మళ్లీ అవే దందాలు కొనసాగించడం కొసమెరుపు. 

సత్వర న్యాయం కోసం రౌడీల చెంతకు

ప్రస్తుతం కొందరు తాము ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నప్పుడు పోలీసులను ఆశ్రయించడాన్ని పక్కనపెట్టి, సత్వర న్యా యం కోసం రౌడీల చెంతకు వెళ్తున్నారు. ‘పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరి గి న్యాయం పొందలేం’ అనే భావనతో రౌడీ షీటర్లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పనికి తగ్గట్టుగా వారికి డబ్బు చెల్లించి సెటిల్‌మెంట్లు చేయింకుంటున్నారని సమాచా రం. పోలీసులు, న్యాయస్థానాలకు భయపడని మొండివాళ్లు రౌడీషీటర్లకు భయపడి వారు చెప్పిన విధంగా సెటిల్‌మెంట్లకు అంగీకరిస్తున్నట్లు పోలీస్‌వర్గాలు తెలుపుతున్నాయి.  

బీహార్ నుంచి తుపాకుల కొనుగోళ్లు

అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు కొన్ని ముఠాలు మాదకద్రవ్యాల సరఫరా, సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నాయి. ఎవరైనా అడ్డు తిరిగితే బెదిరించేందుకు బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. అక్కడ ఒక్కో తుపాకీని రూ.20 వేల నుంచి రూ.50 వేలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసే వాటిలో పిస్టల్, తపంచా ఎక్కువగా ఉంటాయి. రోజురోజుకూ రౌడీషీటర్ల ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వాటిని అరికట్టాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.