calender_icon.png 23 October, 2024 | 3:08 AM

రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు

23-10-2024 12:22:13 AM

  1. పోలీస్, సీబీఐ పేరుతో బాధితులకు ఫోన్
  2. డిజిటల్ అరెస్ట్ చేశామంటూ బెదిరింపులు
  3. వృద్ధులు, మహిళలే టార్గెట్‌

  4. కట్లకుంట విజయ్ కుమార్ :

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. రోజుకో కొత్త పద్ధతిలో ప్రజలను అమాయకులను చేసి అందినంతా దోచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులను టార్గెట్  చేసుకొని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. కొల్లగొడుతున్నారు. 

ప్రొవైడర్ల నుంచి డేటా కొనుగోలు.. 

బీమా వివరాలు, వాటి గడువు, ఇతరత్రా సమాచారం కేవలం ఇటు పాలసీ దారులకు, అటు బీమా సంస్థలకు మాత్రమే తెలుస్తాయి. సైబర్ నేరగాళ్లు ఈ వ్యక్తిగత సమాచారాన్ని అడ్డదారుల్లో కొనుగోలు చేస్తున్నారు. డేటా ప్రొవైడర్లు, బ్రోకింగ్ కంపెనీలు రూ. 10 వేల నుంచి రూ. 20 వేలు ఇస్తే లక్షలాది మంది బీమా వివరాలను అందిస్తున్నాయి.

ఇందులో పాలసీదా రుల వివరాలు, వాటి గడువు, వాహనాల నంబర్లు, ఇన్సూరెన్స్ పాలసీలు ఇలా పూర్తిగా వ్యక్తిగత వివరాలు ఉంటున్నాయి. ఈ సమాచారంతో సైబర్ నేరగాళ్లు వృద్ధులకు ఫోన్లు చేస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో భయభ్రాంతులకు గురి చేసి బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. వీటితో వారి ఖాతాలను లూటీ చేస్తున్నారు. 

పోలీస్, సీబీఐ అంటూ..

మేము ముంబై, ఢిల్లీ పోలీస్, సీబీఐ అధికారులమంటూ ముం దుగా బాధితులకు ఫోన్లు చేస్తారు. మీ వివరాలతో కూడిన విదేశాలకు పంపుతున్న పార్సిల్‌లో డ్రగ్స్, తదితర నిషేధిత వస్తువులు ఉన్నాయంటూ పేర్కొంటారు. అలాగే మీ సంబంధిత బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని చెప్తారు. మీరు మనీలాం డరింగ్ కు పాల్పడినందున, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామంటూ భయపెడతారు.

అనుమానం రాకుండా ఉండేందుకు అరెస్ట్‌కు సంబంధించిన నకిలీ ధ్రువీకరణ పత్రాలను కూడా చూపుతారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తునకు సహకరించాలని, ఇందుకోసం మీ బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఆర్బీఐ నిబంధనల ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని, కేసులో మీ పాత్ర లేదని తెలితే డబ్బు తిరిగి పంపిస్తామంటూ అందినంతా దోచుకుంటున్నారు.

పోలీసుల సూచనలు

ప్రజలు సైబర్ నేరాల బారినపడకుండా సైబర్ క్రైమ్ పోలీసులు పలు సూచనలు జారీ చేశారు. ఎవరైనా ఫోన్ చేసి బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వంటి వివరాలు అడిగినా, కేసు నమోదవ్వకుండా ఉండాలంటే డబ్బు పంపించాలని చెప్పినా మోసమని గుర్తించాలని చెబుతున్నారు.

ఎవరికీ పార్సి ల్ పంపకున్నా ఇతర దేశాలకు మీ పేరుపై పార్సిల్ వెళ్తుందంటే నమ్మొద్దని, వివిధ దర్యాప్తు సంస్థల పేర్లతో ఫోన్లు చేస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఒకవేళ మోసపోయి డబ్బు కోల్పోతే సైబర్ క్రైమ్ పోలీసుల టోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని తెలిపారు.

ఈ మధ్య చోటుచేసుకున్న కొన్ని ఘటనలు..

* తాజాగా మంగళవారం నగరానికి చెందిన ఓ మహిళ(36)కు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. మీరు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ, మీపై కేసు నమో దయింటూ భయపెట్టారు.  మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని పేర్కొంటూ విచారణకు సహకరించాలని చెప్పారు.

బాధితురాలి ఆధార్, పాన్‌కార్డు తదితర వాటిని పరిశీలించిన అనంతరం ఆర్బీఐ సూచనల ప్రకారం ఖాతాలో ఉన్న మొత్తాన్ని తాము సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని చెప్పారు. కేసులో మీ ప్రమేయం లేనట్టు తేలితే డబ్బు తిరిగి చెల్లిస్తామని నమ్మించి ఆమె ఖాతాలో ఉన్న రూ. 43.40 లక్షలు కాజేశారు. 

* నగరానికి చెందిన ఓ వృద్ధుడు(75)కి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. మీ వివరాలతో కూడిన ఇండియా నుంచి ఇరాన్ పంపిస్తున్న ఫెడెక్స్ కొరియర్ కంపెనీ పార్సిల్‌లో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారని, వాటిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారని, ఈ నేపథ్యంలో మీపై ఎలాంటి కేసు నమోదవ కుండా ఉండాలంటే ముంబాయి కస్టమ్స్ అధికారులతో మాట్లాడాలని బాధితుడిని భయభ్రాంతులకు గురి చేసి రూ. 14 లక్షలు లూటీ చేశారు.

* గత శుక్రవారం నగరానికి చెందిన 80 ఏళ్ల మహిళా రిటైర్డ్ ఉద్యోగికి ట్రాయ్ డిపార్ట్‌మెంట్ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు పోన్ చేశారు. బాధితురాలి పేరుపై నమోదైన ఫోన్ నంబర్‌తో అక్రమ ప్రకటనలు, అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నారంటూ బెదిరింపులకు గురిచేశారు. ట్రాయ్ నిబంధ నల మేరకు మీపై ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదైందని, విచారణ నిమిత్తం లక్నో పోలీసు అధికారితో మాట్లాడాలని సూచించారు. ఈ క్రమంలో పోలీస్ వేషధారణలో లైన్‌లోకి వచ్చిన సైబర్ నేరగాడు బాధితురాలిని భయభ్రాంతులకు గురి చేసి ఆమె ఖాతాలో ఉన్న రూ. 13.10 తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. 

* అక్టోబర్ 10న ఓ రిటైర్డ్ ఉద్యోగి(85)కి ముంబై పోలీసులమంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో ముంబైలో బ్యాంకు ఖాతా తెరిచి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ పేర్కొన్నారు. దీంతో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని, విచారణకు పూర్తిగా సహకరించాలని, లేదంటే  నేరుగా వచ్చి అరెస్ట్ చేస్తామంటూ భయపెట్టారు.

ఈ క్రమంలో పోలీసు యూనిఫాంలో లైన్‌లోకి వచ్చిన సైబర్ నేరగాడు విచారణ నిమిత్తం తమ ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఆర్బీఐ బ్యాంకుకు బదిలీ చేయాలని, కేసులో మీ ప్రమేయం లేనట్టు తెలితే 24 గంటల్లో డబ్బు తిరిగి పంపిస్తామని తెలిపారు. ఇదంతా నిజమేనని నమ్మిన వృద్ధుడు తన ఖాతాలో ఉన్న రూ. 8.30 లక్షలను వారు సూచించిన ఖాతాకు బదిలీ చేశారు.