calender_icon.png 19 April, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వీన్ ఈజ్ బ్యాక్!

08-04-2025 12:00:00 AM

నటిగా తెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో అలరించారు సమంత. అయితే ఆమె బిగ్‌స్క్రీన్‌పై కనిపించి ఏడాదిన్నర అవుతోంది. చివరిసారి విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’లో నటించారామె. దీని తర్వాత సమంత నటించిన వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీబన్నీ’ ఓటీటీలో రికార్డు సృష్టించింది. నిరుడు తన పుట్టిన రోజున ‘మా ఇంటి బంగారం’ అనే ప్రాజెక్టును ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ మినహా ఇప్పటివరకూ ఎలాంటి అప్‌డేటూ లేదు.

ఇదిలా ఉండగా సమంత 2023లో నిర్మాతగా మారారు. ‘ట్రాలా లా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించా రు. ఈ సంస్థ నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సమంత ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. “పెద్ద కలలతో మా చిన్న ప్రేమను మీకు అందిస్తున్నాం. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఇది నిజంగా నాకు ఎంతో ప్రత్యేకం.

గొప్ప ప్రారంభం” అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. సమంత చేసిన ఈ పోస్ట్ కన్నా ఆమె ఎక్స్‌లో కనిపించడంపైనే ఆసక్తికర చర్చ జరుగుతోందిప్పుడు. అందరు తారల్లాగే సమంత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆమె 2012లో ట్విటర్ (ఇప్పుడు ఎక్స్) ప్రొఫైల్ ఓపెన్ చేశారు. ఇందులోని తన పోస్టులన్నీ ఇటీవల డిలీట్ చేశారు. అప్పట్నుంచీ యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాల్లోనే యాక్టివ్‌గా ఉంటున్నారు.

తాజాగా సమంత ఎక్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. సోమవారం తొలిసారి ఓ పోస్ట్ పెట్టారు. అదే తాజా చర్చకు దారి తీసింది. ప్రస్తుతం సమంతను ఎక్స్‌లో 10.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. సమంత రీఎంట్రీపై ఆనందం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు ‘వెల్‌కమ్ బ్యాక్ సామ్..’ అనీ, ‘క్వీన్ ఈజ్ బ్యాక్’ అనీ ఆమెపై ఉన్న ప్రేమాభిమానాలతో కామెంట్స్ బాక్సులను నింపేస్తున్నారు.