- పురుగుల బియ్యం, గడువు ముగిసిన సరుకులు
- పాడైన కూరగాయలు, కుళ్లిన గుడ్లు..
- ఇదీ జిల్లాలోని పలు హాస్టళ్లు, పాఠశాలల పరిస్థితి
- అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు
- కాంట్రాక్టర్ల వెనుక బడా నాయకుల హస్తం!
కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): ఆశ్రమ, గురుకుల పాఠశాలలతో పాటు హాస్టళ్లకు సరఫరా అవుతున్న సరుకుల్లో నాణ్యత లోపించినట్టు తనిఖీల్లో స్పష్టమవుతున్నది. పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ఉన్నత అధికారులు తనిఖీలను విస్తృతం చేశారు.
ఈక్రమంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో.. ప్రభుత్వ పాఠశాలు, గురుకులాలు, హాస్టళ్లలో అపరిశుభ్రత, పురుగులతో కూడిన బియ్యం, కుళ్లిన గుడ్లు, పాడైపోయిన కూరగాయలు, గడువు తీరిన నిత్యావసర సరుకులే దర్శనమి స్తున్నాయి.
నాణ్యత లేని సరుకులను నిరాకరిస్తే సదరు కాంట్రాక్టర్లు దురసుగా ప్రవర్తించడంతో పాటు సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
కొరవడిన పర్యవేక్షణ..
ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవటం వల్లే అధికారులు, కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలపై ముఖ్యమంత్రి స్పందిస్తే గాని జిల్లాస్థాయి అధికారులు తనిఖీలకు కదలకపోవడం ఆశ్యర్యం కలిగిస్తోంది. తనిఖీల్లో భాగంగా.. తిర్యాణి మండలంలోని హాస్టల్‌లో చిన్నారులకు ఉదయం రాగి జావా పోయకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెరమెరి మండలంలో గడువు తీరిన ఉప్పు ప్యాకెట్లు ఉండటంతో కలెక్టర్ జీసీసీ గోదాంను తనిఖీ చేయించగా.. అందులో 12 క్వింటాళ్ల ఉప్పు, 12 క్వింటళ్ల చిక్కి బార్లు ఉన్నట్లు తేలింది. గిరిజన సంక్షేమశాఖ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడే బయటపడింది. రెబ్బెన మండలంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి చేసిన తనిఖీల్లో.. చెడిపోయిన కూరగాయలు, కుళ్లిన కోడిగుడ్లు, అపరిశుభ్ర వాతావరణం దర్శనమివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్కువ ధరకు కోడింగ్..
గురుకులాలు, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో సరుకుల పంపిణీకి ఏర్పాటు చేసిన టెండర్లను దక్కించుకోవాలన్న ఉద్దేశ్యంతో కొందరు తక్కువ ధర కోడ్ చేయడంతో ప్రభుత్వం వారికే టెండర్ కేటాయిస్తుంది. ఆ తర్వాత కాంట్రాక్టర్లు కాలం చెల్లిన సరుకులు, పరుగులు పట్టిన సరుకులను పంపిణీ చేస్తున్నారు.
తక్కువ ధరకు టెండర్ వేసిన కాంట్రాక్టర్ నాణ్యమైన సరుకులను ఎలా సరఫరా చేస్తారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇలాంటి కాంట్రా క్టర్ల వెనుక బడా నాయకుల హస్తం ఉన్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఘటనలు ఇవి..
* పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ పాఠశాలలో టెన్త్ విద్యార్థి రాజేశ్ ప్రాణాలు కోల్పోయాడు.
* తిర్యాణి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న టేకం రమేశ్ మృతి చెందాడు.
* జిల్లా కేంద్రంలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో సెకండియర్ విద్యార్థిని సంగీత జ్వరంతో మృతి చెందగా.. మరో విద్యార్థిణి లక్ష్మి కూడా అస్వస్థతతో మృతి చెందింది.
* సిర్పూర్(టి) మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకులంలో ఐదో తరగతి చదువుతున్న ఆశ్విని అనారోగ్యంతో మృతి చెందింది.
* వాంకిడి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో తాజాగా విద్యార్థిని శైలజ మృతి చెందింది.
* అనారోగ్య కారణాలతో పాటు ఫుడ్ పాయిజన్ ఘటనల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు అనేకం.
పర్యవేక్షణ లోపంతోనే..
ఆశ్రమ, గురుకులాలు, వసతి గృహాల్లో పర్యవేక్షణ లోపంతోనే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలు పోతే కాని ఉన్నతాధికారులు స్పం దించడం లేదు. శీతాకాలంలో విద్యార్థులు చల్లటి నీటితో స్నానం చేస్తూ ఇబ్బందులు పడుతున్నా తనఖీ చేస్తున్న అధికారులకు తెలియడం లేదా? విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన అధికారులు వారి బాధ్యతను మరిచి నిర్దయగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందించేలా పోషణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
అవిడపు ప్రణయ్‌కుమార్, బీసీ యుజవన సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆసిఫాబాద్