calender_icon.png 19 November, 2024 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవన ప్రయోజనమే పరమావధి

31-07-2024 12:00:00 AM

పాలకుర్తి రామమూర్తి :

త్యజేద్ధర్మం దయాహీనం, 

విద్యాహీనం గురుం త్యజేత్

త్యజేత్ క్రోధముఖీ భార్యా 

నిఃస్నేహాన్బాంధవాంత్యజేత్!

 నీతి: 4

ప్రతి వ్యక్తి జీవిత ప్రయోజనం ఆనందంగా, ప్రశాంతంగా జీవనాన్ని సాగించడమే. పరస్పర ఆధారిత సమాజంలో వ్యక్తి జీవితం ఉన్న స్థితినుండి ఉన్నత స్థితిని చేరాలంటే వేటిని త్యజించాలో (విడిచి పెట్టాలో) ఆచార్య చాణక్యుడు వివరించారు. 

మొదటగా ఏ ధర్మంలోనైతే దయాగుణం లేదో అది ఎంత గొప్పదైనా దానిని విడిచి పెట్టాలి. ‘ధర్మం’ అంటే ఆచరించదగింది (ఆచరణ యోగ్యమైంది). ధర్మాన్ని మతంగా పొర పడుతున్నాం. సామాజిక ప్రయోజనం లేని సమాజానికి ఉపయుక్తం కాని ధర్మాన్ని ఆచరించడం వల్ల వ్యక్తికీ, సమాజానికీ ప్రయోజనం ఉండదు. కాబట్టి, అది విడిచి పెట్టదగింది. ఏ ధర్మాన్ని ఆచరించడం వల్ల ఐహిక, ఆముష్మిక ప్రయోజనాలు సిద్ధిస్తాయో అది ఆచరణీయమైంది (ఆదరణీయమైంది). అహింస, దయ, ప్రేమ, వాత్సల్యం వంటి గుణాలు సమాజాన్ని ఒక్క తాటిపై నిలిపేందుకు సహకరిస్తాయి. అవి మృగ్యమై స్వార్థం పెరిగితే ఒకరినొకరు హింసించుకునేందుకు సమాయత్తమై అరాచకం ఉద్భవిస్తుంది. కాబట్టి, అటువంటి ధర్మాన్ని విడిచి పెట్టమని చాణక్యుడు ప్రబోధిస్తున్నాడు.

రెండవది విద్యాహీనుడైన గురువు. విశ్వవిద్యాలయాలు ఇచ్చే పట్టాలు విద్యకు కొలమానం కాదు. విద్య వినయాన్ని, సంస్కారాన్ని ఇవ్వాలి. కలిసి బతకడానికి అవసరమైన మానసిక చైతన్యాన్ని అందించాలి. దూరదృష్టిని, శాస్త్రీయ భావాన్ని నింపాలి. సరైన విధానంలో సరైన సమాజాన్ని నిర్మించడానికి అవసరమైన అలోచనా విధానాన్ని రేకెత్తించాలి. అప్పుడే వ్యక్తి సంస్కారవంతుడవుతాడు. అతని సంస్కారం సమాజానికి ఉపయుక్తమవుతుంది. ఇక, గురువు వ్యక్తిలోని అంధకారాన్ని లేదా అజ్ఞానాన్ని తొలగించగలగాలి. ఉపాధ్యాయుడు అక్ష రాలు నేర్పిస్తాడు. ఆచార్యుడు సంస్కృతిని పరంపరగా అందిస్తాడు. గురువు జ్ఞానజ్యోతిని మనసులో వెలిగిస్తాడు. అలాగే, మామూలు ఉపాధ్యాయుడు పాఠం చెపుతాడు. ఉత్తమ ఉపాధ్యా యుడు భావార్థాలను వివరిస్తాడు. అత్యుత్తమ ఉపాధ్యాయుడు ఆ విలువలను ప్రతిక్షేపించడం ఎలాగో తెలియచేస్తాడు. గురువు (మార్గదర్శి)  తెలుసుకునేందుకు కావలసిన ప్రేరణనిస్తాడు. ఆ తెలుసుకోవడమే ఎఱుక. దానికే విద్య కావాలి. ఆచరణాత్మకమైన అలాంటి విద్యను శిష్యులకు అందించలేనివాడు గురుత్వానికి పనికిరాడు. కాబట్టి, అతనిని విడిచిపెట్టమంటాడు.

మూడవది క్రోధమూర్తియైన భార్య. కోపం భావోద్వేగానికి సంబంధించింది. అవసరానికి కోపాన్ని ప్రదర్శించడం సమంజసమే. అయితే, కోపాన్ని అట్టే పెట్టుకుంటే అది క్రోధంగా మారుతుంది. అది తనకుగాని తన చుట్టూ ఉండేవారికిగాని మంచిది కాదు. ‘క్రోధాద్భవతి సమ్మోహా, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశో బుద్ధినాశః, బుద్ధినాశో ప్రణశ్యతి’ అన్నది గీత. అలాంటి క్రోధాన్ని పూనిన భార్యను విడిచి పెట్టమంటాడు చాణక్యుడు. భార్యనేకాదు అలాంటి భర్తనూ, ఇంకా స్నేహితులు, బంధువులనూ విడిచి పెట్టమంటాడు చాణక్యుడు. 

ఆధిపత్యం కన్నా ఆత్మీయత ముఖ్యం

కొన్ని బంధుత్వాలు సహజమైనవి. తల్లి తండ్రి, సోదరులు.. వీటిని త్రోసి పుచ్చలేం. భార్య, భర్త, స్నేహితులు వంటివి సహజమైనవి కావు, ఏర్పరచుకున్నవి. ఏ బంధుత్వమైనా సమాజానికి ప్రతిబంధకంగా మారినా, అభివృద్ధి నిరోధకంగా ఉన్నా అలాంటి బంధుత్వాన్ని, స్నేహాన్ని విడిచి పెట్టాల్సిందే. నిజానికి ఏ బంధుత్వానికీ చావు లేదు. మన అహంభావం, మూర్ఖత్వం, స్వార్థం, ఆధిపత్య ధోరణి లాంటివే బంధుత్వాలను మలినం చేస్తాయి, పాడు చేస్తాయి. ప్రయాణం అది భౌతిక జీవితమైనా, ఆధ్యాత్మికమైనా కొన్ని బంధాలు పరిణతిని పెంచుతాయి. మరి కొన్ని అభివృద్ధికి ప్రతిబంధకాలవుతాయి. 

జీవితంలో దేనికోసం దేనిని విడిచిపెట్టాలో తెలియాలి. కొందరు మనలను ఇష్టపడతారు. మరి కొందరిని మనం ఇష్టపడతాం. కష్టకాలంలో మనకు సహాయపడే వ్యక్తికోసం ఆరాటపడతాం. ఆ సమయంలో మీరు ప్రేమించే వ్యక్తియే మిమ్మల్ని ప్రేమిస్తే అతన్ని ఆశ్రయించడం ఉత్తమం. అలా కాకపోతే మీరు ప్రేమించే వ్యక్తికన్నా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని ఎన్నుకోవడమే సమంజసం. దానిని గ్రహించి, ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి, జీవిత ప్రయోజనానికి అనుగుణమైన విధంగా నడుచుకొమ్మని ప్రబోధిస్తున్నాడు ఆచార్య చాణక్యుడు.