calender_icon.png 25 October, 2024 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా శుక్రవారం సభ

25-10-2024 05:44:05 PM

హుజురాబాద్, (విజయక్రాంతి): పోషకాహార లోపం బారిన పడకుండా మహిళలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకే మూడు నెలల కిందట శుక్రవారం సభ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడీ కేంద్రం ఆవరణలో శుక్రవారం సభకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రంలో నిర్వహించే ప్రతి శుక్రవారం సభకు మహిళలు తప్పనిసరిగా రావాలన్నారు. దీంతో పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు.

మహిళలు మొదట తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో 52 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు. మహిళలందరూ మూడు నెలలకోసారి ప్రభుత్వ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇవే పరీక్షలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేయించుకుంటే సుమారు రూ.40 వేలకు పైన అవుతాయన్నారు. మనకు వచ్చే వ్యాధులను ముందే గుర్తించి జాగ్రత్తపడాలన్నారు. ఆంగన్ వాడి కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్ళుగా అప్ గ్రేడ్ చేసి టీచర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులను ఆంగన్ వాడి కేంద్రాలకు విధిగా పంపించాలని తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ బాబు, డీఎంహెచ్ఓ సుజాత, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తహసీల్దార్ కనుకయ్య, అంగన్ వాడీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.