calender_icon.png 6 February, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాటై పుట్టిన ప్రజాగర్జన

31-01-2025 12:00:00 AM

నేడు గద్దర్ జయంతి :

ప్రజా వాగ్గేయ కారుడు, ప్రజా కవి, కళాకారుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్.  తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయి పద్దెనిమిది నెలలయింది. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు.  మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన లచ్చమ్మ, శేషయ్య దంపతులకు 1949 జనవరి 31న ఆయన జన్మించారు.

అరవై వసంతాలకు పైగా ప్రజలతో మమేకమై ఎన్నో ప్రజా ఉద్యమాలకు తన మాట, పాట ద్వారా ఊపిరి నింపిన విప్లవకారుడు. నక్సల్బరీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత బహుజన ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమం.. ఇలా అన్ని ఉద్యమాలలో  తన పాటలతో ప్రజా జీవితాలను ప్రభావితం చేశారు, ప్రభుత్వాలను కదిలించారు.

‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతావ్ కొడకో  నైజాము సర్కరోడా’ అని రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన కొరకు గళమెత్తారు. నిజామాబాద్, హైదరాబాద్‌లో గద్దర్ విద్యాభ్యాసం చేశారు. 1975లో కొద్ది కాలం  కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా.. పోరు తెలంగాణమా’ పాట ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఉద్యమం అప్పటిదాకా ఒక ఎత్తు. ఆ పాట తర్వాత మరొక ఎత్తుగా కొనసాగింది. గద్దర్ ఆట, పాట కోట్లాది మందిని కదిలించింది. ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. కొన్ని వేలమంది ఉద్యమం బాట పట్టారు. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై’ పాటకు నంది అవార్డుకు ఎంపికయ్యారు గద్దర్. కానీ, అవార్డును స్వీకరించేందుకు తిరస్కరించారు.

సాంస్కృతిక విప్లవం దిశగా..

దేశంలో దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. అమరవీరుల కుటుంబాలకు చేయూత నిచ్చేవారు. పీపుల్స్‌వార్ పార్టీ క్యాడర్ రిక్రూట్‌మెంట్ ఆయన పాటల ద్వారా ప్రభావితం అయ్యింది. చాలామంది సానుభూతిపరులు, పౌర ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, దళిత బహుజన సంఘాలలో సాంస్కృతిక విప్లవం తెచ్చిన వ్యక్తి. 

ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. నాడు మరణం అంచుల దాకా వెళ్లి, ప్రాణాలతో బయటపడ్డారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావజాల వ్యాప్తి కోసం ఊరూరా తిరిగి బుర్రకథలతో ప్రచారం చేసేవారు. అలా ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకుడు బి. నరసింగరావు.. భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో నరసింగరావు ప్రోత్సాహంతో గద్దర్ ‘ఆపర రిక్షా’ పేరుతో తన మొదటి పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. సామాజిక తెలంగాణ స్వప్నం నెరవేరలేదని, ఎంతో కాలంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేవలం కొందరి చేతుల్లో ఉందని వాపోయేవారు. 

తాను జీవించి ఉన్న చివరి రోజులలో సామాజిక సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ, అణగారిన వర్గాలకు అవకాశాలు  కాంగ్రెస్ పార్టీ ద్వారానే అని గ్రహించి ఆ పార్టీ ఏర్పాటు చేసిన సభలలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పట్ల వల్లమాలిన అభిమానం. ఒక విప్లవకారుడి అంతిమ యాత్రలో ప్రభుత్వ లాంఛనాలతో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అరుదైన వ్యక్తి గద్దర్.   

ముప్ఫు సంవత్సరాల క్రిందట మహాబోధి  విద్యాలయం ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకు విద్యాదానం చేశారు. గుమ్మడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో  ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు నేలపైన ప్రజాకళలు ఉన్నంతవరకు గద్దర్ పాట సజీవంగా ఉంటుంది.   

 డా.జి. వెన్నెల గద్దర్