05-04-2025 12:03:28 AM
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హనుమకొండ, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను గుర్తించి దశలవారీగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పరకాల నియోజకవర్గ యువతీ యువకులకు వివిధ కంపెనీల లో ఉద్యోగావకాశాల కల్పన కు మెగా జాబ్ మేళాను నిర్వహించారు.
ఈ మెగా జాబ్ మేళాను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా వివిధ కంపెనీలు జాబ్‌మేళాలో నిర్వహిస్తున్న ఇంట ర్వ్యూలను మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే లు, కలెక్టర్లు పరిశీలించారు.
ఈ సందర్భంగా మెగా జాబ్ మేళాను ఉద్దేశించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే ఆకాంక్ష తో ముఖ్య మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తు, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను గుర్తించి దశల వారీగా 2లక్షల ఉద్యోగాలను కల్పించాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్లు, పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, బీటెక్ చదివిన నిరుద్యోగ యువత దాదాపుగా 25 నుంచి 30 లక్షల వరకు ఉంటారని, నిరుద్యోగుల పక్షాన నిలబడాలనే ఉద్దేశంతో మెగా జాబ్ మేళాలను ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నారన్నారు.
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మెగా జాబ్ మేళా కు పెద్ద ఎత్తున హాజరైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల ను కల్పించాలనే సంకల్పంతో మెగా జాబ్ మేళా ను ఏర్పాటు చేసినట్లు, భవిష్యత్తు లోను ఉద్యోగ, ఉపాధి, శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికీ, రాబోయే నాలుగేళ్ల లోనూ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఉద్యోగ అవకాశాల కల్పన అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
నిరుద్యోగ యువత ఆయా గ్రామాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని మెగా జాబ్ మేళా లో వివిధ కంపెనీలు ఐదు వేలకు పైగా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ భూపాలపల్లి లోను ఈ నెల 26వ తేదీన మెగా జాబ్ మేళా ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గ్రూప్స్ పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నారు.
మెగా జాబ్ మేళా లో పాల్గొన్న వివిధ కంపెనీలు అర్హతలను బట్టి ఇంటర్వ్యూలలో ఆఫర్ లెటర్లను మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద తదితరుల చేతుల మీదుగా ఎంపికైన అభ్యర్థులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే, డీఎఫ్ వో అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, వివిధ శాఖల అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.