- ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తమను అగౌరవపరిచారని..
- శిలాఫలకం వద్ద బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల నిరసన
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 9: బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు ప్రొటోకాల్ రగడ తలనొప్పిగా మారింది. కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే.. సాయి బాలాజీ నగర్‌లో స్థానిక బీఆర్‌ఎస్ కార్పొరేటర్ మాలతీనాగరాజు లేకుండానే ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి అక్కడి నుంచి వెళ్లిపోయా రు. ఎమ్మెల్యే షెడ్యూల్ సమయం కంటే ముందే వచ్చి తాను లేకుండానే శంకుస్థాపన చేయడం ఏంటని సదరు కార్పొరేటర్ మండిపడ్డారు.
ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన శిలా ఫలకం వద్ద బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు రవీందర్‌రెడ్డి, మాలతీనాగరాజు, నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో ఏకమై తమను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కమిషనర్ శరత్‌చంద్ర తీరు సరిగా లేదని కార్పొరేటర్ మాలతీనాగరాజు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన స్వామిగౌడ్ కమిషనర్‌కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.