లక్ష్మి కెనాల్ నుంచి జలాలు విడుదల చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సమాచారం లేదని ఆ పార్టీ నేతల మండిపాటు
నిజామాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య ప్రొటోకాల్ రగడ నడుస్తున్నది. ప్రాజెక్టు అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ప్రాజెక్ట్ లక్ష్మి కాలువ నుంచి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, బాల్కొండ నియోజకవర్గానికి చెందిన కార్పొరేషన్ చైర్మన్లకు సమాచారం ఇవ్వకుండా, కేవలం ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డితో జలాలు విడుదల చేయించడంపై రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్‌రెడ్డి మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై ఇదేరోజు ఆర్మూర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్ట్ అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా నీటిని విడుదల చేయడం సరికాదన్నారు. ప్రొటోకాల్ వ్యవహారంపై తాము రాష్ట్రప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఉమ్మడి అదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు సాగు నీరు అందించే సరస్వతి కాలువ నుంచి ఇదేరోజు నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి జలాలు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కెనాల్ ద్వారా ఐదు మండలాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. జలాలతో 36 వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయన్నారు. నీటి విడుదలకు సంబంధించిన విషయాలను కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.