calender_icon.png 27 September, 2024 | 4:48 PM

చెక్కుల పంపిణీలో ప్రొటోకాల్ రగడ

27-09-2024 02:53:20 AM

దుబ్బాకలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య వార్

విసిగిపోయి బయటకు వాకౌట్ చేసిన మంత్రి సురేఖ

అదేబాటలో ఎంపీ రఘునందన్‌రావు

దుబ్బాక, సెప్టెంబరు 26: దుబ్బాకలో గురువారం రాష్ట్ర దేవాదాయ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ రసాభాసగా సాగింది. మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు వేదికపై ఆశీనులయ్యారు. ఈక్రమం లో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి వేదికపైకి వచ్చారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డిని వేదికపై నుంచి కిందికి పంపించాలంటూ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. శ్రీనివాస్‌రెడ్డి వేదికపైనే ఉండాలని ఆయన వర్గీయులు గట్టిగా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలు చేశా రు. పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించినా రెండు వర్గాల వారు వినలేదు. మంత్రి కొండా సురేఖ సైతం సముదాయించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో మంత్రి  చెక్కులు పంపిణీ కార్యక్రమం పూర్తి కాకుండానే మంత్రి వెళ్లిపోయారు. తర్వాత ఎంపీ రఘునందన్‌రావు సైతం బయటకు వెళ్లారు.