పారిస్, జూలై 31: తన సంపదలో సగ భాగాన్ని తోటమాలికి రాసిస్తానని ప్రకటించి గత ఏడాది వార్తల్లో నిలిచిన ‘హెర్మేస్’ లగ్జరీ ప్యాషన్ బ్రాండ్ వారసుడు నికోలస్ ప్యూచ్ తాజాగా సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. 81 ఏళ్ల ఈ కుబేరుడు తన సంపదలో రూ.పది వేల కోట్ల (13 బిలియన్ డాలర్లు) విలువైన 6 మిలియన్ల షేర్లు అకస్మాత్తుగా మాయమ య్యాయని, అందుకు తన మాజీ వెల్త్ మేనేజర్ ఎరిక్ ఫ్రేమండ్ కారణమని స్విస్ కోర్టు ఎదుట ఇటీవల ఆరోపించాడు. షేర్ల మాయంపై ప్యూచ్ కోర్టులను ఆశ్రయించాడు. ఈ ఆరోపణలను స్విస్ కోర్టు తోసిపుచ్చింది. షేర్లు పడిపోవడంలో ఎరిక్ ఫ్రేమండ్ పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారమూ లేదని స్పష్టం చేసింది.
ప్యూచ్ ఆ షేర్లను 2012లో జెనీవాలోని ఓ బ్యాంక్‌లో డిపాజిట్ చేశారని, ఆ తర్వాత వాటి సంగతి ఏమైందో ఎవరికీ తెలియదని ట్రిబ్యూన్ డీ జెనీవ్ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. బ్లూంబర్గ్ మీడియా సంస్థ ‘సాధారణ మానవులెవరూ ఈ స్కాంను గుర్తించలేరు’ అని ఓ కథనం ప్రసారం చేసింది. ఫోర్బ్స్ ప్రకారం ప్యూచ్ నికర ఆస్తుల విలువ సుమారు 11.7 బిలియన్ డాలర్లు. ఆయన ప్రపంచంలోనే 161వ ధనవంతుడు. హెర్మేస్ బ్రాండ్‌కు ఐదో తరం వారసుడైన ప్యూచ్ జీవితాంతం ఒంటరిగానే జీవించారు. పిల్లల్లేరు.