calender_icon.png 3 April, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే సంక్రాంతికి రప్ఫాడిస్తారట.. సరికొత్తగా ‘మెగా157’ టీమ్ పరిచయం!

01-04-2025 10:15:10 PM

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు అనిల్ రావిపూడి ఉగాది రోజు సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘మెగా157’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రారంభమైందీ ప్రాజెక్టు. ఈ చిత్రంపై అభిమానులు, ప్రేక్షకుల అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. పక్కా ఎంటర్‌టైనర్స్ తెరకెక్కించడంలోనే కాకుండా సినిమాలను ప్రమోట్ చేయడంలోనూ తనదైన పంథాను అనుసరిస్తుంటాడు డైరెక్టర్ అనిల్. ఆయన ప్రచార సరళ ఎలా ఉంటుందో ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ప్రేక్షకులు చూశారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తుందనగా తనదైన శైలిలో ప్రచార పర్వానికి తెర తీశాడు అనిల్ రావిపూడి. విభిన్నమైన రీతిలో ప్రమోషన్స్ నిర్వహించడం ద్వారా రికార్డులను కొల్లగొట్టడంలో ఆయన కృషి అభినందనీయం. 

ఇప్పుడు ‘మెగా157’ విషయంలో మరో అడుగు ముందుకేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ఆరంభం నుంచే విభిన్నమైన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రమోషన్‌లో భాగంగా, చిరంజీవి కెరీర్‌లోని ఐకానిక్ పాత్రలతో ఒక వినూత్నమైన వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోతో ‘మెగా157’ మూవీ టీమ్‌ను ఎంతో వినోదాత్మకంగా పరిచయం చేసి, ఆకట్టుకున్నారు. 

వీడియో ప్రారంభంలో, దర్శకత్వ విభాగం.. చిరంజీవి వినోదాత్మక టైమింగ్ చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నామని చెప్పారు. రచయితలు అజ్జు మహాకాళి, తిరుమల నాగ, ఉపేంద్ర తమ రైటింగ్‌తో ‘డైమాండ్స్’లా పనిచేస్తామని సరదాగా చెప్పారు. రచయిత నారాయణ అయితే అనిల్ రావిపూడి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ‘హిట్లర్’లా ప్రశ్నిస్తానని సరదాగా చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రచయిత ఎస్ కృష్ణ ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయం అని అన్నారు. ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్ తనను తాను ‘మేస్త్రీ’గా పేర్కొంటూ ఎంట్రీ ఇచ్చారు. ఎడిటర్ తమ్మిరాజు అవసరం లేని సీన్స్ మాత్రమే కట్ చేస్తానని సరదాగా చెప్పారు. డీవోపీ సమీర్‌రెడ్డి జెట్‌స్పీడ్‌లో షూట్ చేస్తానన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ‘మాస్టర్’ సినిమా పాట పాడుతూ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి స్వయంగా ‘గోదారి గట్టు’ పాట నుంచి కొన్ని లైన్స్ ఆలపించడం అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రేక్షకులకు బ్లాక్‌బస్టర్ ఫెస్టివల్ అందిస్తామని హామీ ఇచ్చారు. 

చిరంజీవి తనదైన శైలిలో సుస్మిత ‘కొణిదెల’ ఇంటిపేరు నిలబెట్టాలి అని సరదాగా చెప్పడం ఆకట్టుకుంది. చివరగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తాను ‘గ్యాంగ్‌లీడర్’గా వ్యవహరిస్తానని చెబుతూ ‘రప్ఫాడిద్దాం...’ అంటూ తన శైలిలో ఆకట్టుకున్నారు. ఈ ప్రమోషనల్ వీడియో ‘మెగా157’పై అంచనాలను మరింత పెంచుతూ, ఇది మరో భారీ హిట్‌గా నిలుస్తుందని ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.