20-03-2025 02:06:24 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్,మార్చి 19(విజయ క్రాంతి):లే-అవుట్ భూముల క్రమబద్దీకరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఎల్ ఆర్ ఎస్-2020 పథకంలో అర్హులైన అభ్యర్థుల నుండి రుసుము వసూలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
బుధవారం కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి వార్డు అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో అర్హులైన అభ్యర్థులలో ఈనెల 31వ తేదీ వరకు రుసుము చెల్లించే వారికి కల్పించే 25 శాతం రుసుము మినహాయింపు అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ ఆర్ ఎస్-2020 పథకంలో భాగంగా లే-అవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఈ నెల 31వ తేదీలోగా సదరు అభ్యర్థులు 100 శాతం రుసుము చెల్లించినట్లయితే అందులో 25 శాతం రుసుము రాయితీ మినహాయింపు ఇవ్వడం జరుగుతుందని, ఈ విషయమై అర్హత కలిగిన ప్రతి అభ్యర్థులకు సమాచారం అందించి సకాలంలో రుసుము చెల్లించే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు.
కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి సందర్శించి విద్యార్థులకు కల్పించిన వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో చల్లని శుద్ధమైన త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా కల్పించడంతో పాటు వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులు, ఓ. ఆర్. ఎస్. ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తహసిల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వార్డు అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.