ఆర్‌ఎంపీ, పీఎంపీల సదస్సులో ప్రొఫెసర్ కోదండరామ్
ముషీరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ప్రజారోగ్య సంరక్షణలో ఆర్‌ఎంపీ, పీఎంపీల పాత్ర చాలా కీలకమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సభలో పాల్గొన్న కోదండరామ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులైన ఆర్‌ఎంపీ, పీఎంపీల సేవలను మెరుగుపరచాలన్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు వైజ్ఞానిక శిక్షణను ఇచ్చి ఆధికారిక సర్టిఫికెట్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. దాడులు జరుగుతున్నాయని వైద్య వృత్తికి దూరంగా ఉండొద్దన్నారు. ఆయా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జనవిజ్ఞాన వేదిక డాక్టర్ బ్రహ్మారెడ్డి, విజ్ఞాన దర్శిని రమేష్, ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల నాయకులు బాలబ్రహ్మచారి, మోహన్, వెంకట్ రెడ్డి, హుస్సేన్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.