calender_icon.png 8 January, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారించాలి

07-01-2025 04:56:00 PM

స్థానిక సంస్థల్లో ప్రాధాన్యతనివ్వాలి 

కార్పొరేషన్ ఏర్పాటుతో కుల వృత్తిని కాపాడాలి

సంఘం మండల అధ్యక్షులు వెంకన్న...

లక్షేట్టిపేట (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని మండల, పట్టణ అధ్యక్షులు చెరుకు వెంకన్న, నడిగొట్టు అంజన్నలు కోరారు. మంగళవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఎన్నో ఏళ్లుగా నాయి బ్రాహ్మణులకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యంగా కుల వృత్తితో జీవించే వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తమకు కొన్ని సీట్లు కేటాయించాలని, రాజకీయ ప్రాధాన్యత లేకపోవడంతో నాయి బ్రాహ్మణులు నిరాధారణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు తమను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించడంతో సరైన సామాజిక న్యాయం జరుగలేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి న్యాయం చేయాలన్నారు.

రాష్ట్రంలో తమ సామాజిక వర్గం నుంచి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో లేకపోవడం ఎంతవరకు న్యాయమో అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలన్నారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి కళ్యాణం రవి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు సేవలందించే నాయి బ్రాహ్మణుల బ్రతుకులు మాత్రం మారడం లేదన్నారు. కుల వృత్తిలో భాగంగా అనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వం ప్రత్యేక హెల్త్ కార్డులు జారీ చేసి ఆదుకోవాలన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న నాయి బ్రాహ్మణులకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రతి మండలంలో ఒక సామాజిక భవనాన్ని నిర్మించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల నారాయణ, ముఖ్య సలహాదారులు శ్రీరాముల అంజన్న, నాయకులు గొల్లపెల్లి భాస్కర్, శ్రీరాముల గంగన్న, వెంకటేష్, రాచర్ల రామన్న, మెట్ పల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.