24-02-2025 11:28:21 PM
కొత్త అక్రిడేషన్ కార్డులపై కాలయాపన సరికాదు..
టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సమాచార శాఖ కార్యాలయం ఎదుట ధర్నా..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య అన్నారు. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంకులోని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలపై అన్యాయం జరిగిందని, ఈ ప్రభుత్వంలో జాప్యం జరుగుతోందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు సాకుతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం సరికాదని విమర్శించారు. కొత్త అక్రిడేషన్ కార్డులపై కాలయాపన సరికాదన్నారు. హెల్త్ కార్డులు, వైద్యసదుపాయాలు అందక రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సమాచార శాఖ కమిషనర్ ఎస్.హరీష్‌ను కలిసి వినతిప్రతం ఇచ్చారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పి.రాంచందర్, జి.రఘు, ఎస్.కే.సలీమ, కె.పాండురంగారావు, పి.నాగవాణి, మణిమాల తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలి.. హెచ్‌యూజే
హైదరాబాద్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలివ్వాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే కార్యదర్శి బి.జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం లక్డీకాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అక్రిడేషన్ల గడువు మరోసారి పొడగించకుండా కొత్త అక్రిడేషన్ కార్డులివ్వాలని కోరారు. ఈ కార్డులు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారం పడబోదని చెప్పారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రాధిక, హెచ్‌జేయూ నాయకులు జి.వీరేష్, బి.కాలేబ్, జి.రేణయ్య, జె.క్రాంతి, ఎస్.మాధవరెడ్డి, పి.లక్ష్మణ్‌రావు, తలారి.శ్రీనివాస్, మధుకర్, కె.లలిత, పి.విజయ, తదితరులు పాల్గొన్నారు.