calender_icon.png 8 February, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైంగికదాడికి పాల్పడిన కీచక ప్రిన్సిపల్ ను కఠినంగా శిక్షించాలి

07-02-2025 10:44:37 PM

ఇబ్రహీంపట్నంలోనీ లయోలా హై స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన..

ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): లైంగికదాడికి పాల్పడిన కీచక ప్రిన్సిపల్ ను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై అదే పాఠశాలకు చెందిన కీచక ప్రిన్సిపల్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి రాగా అతనిపై బుధవారం ఇబ్రహీంపట్నం పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పాఠశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాయికాడి శంకర్ మాట్లాడుతూ.. పాఠశాల గుర్తింపును రద్దు చేయడంతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి పాఠశాలకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినిలపై కీచక పర్వానికి పాల్పడితే వారికి రక్షణ ఎక్కడ ఉటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగి దాదాపు నాలుగు రోజులు కావస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై విద్యాధికారులు స్పందించకపోతే, జిల్లా అధికార యత్రాంగం మరి ఏ ఘటనకు స్పందిస్తుందని మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

దీంతో ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులను అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటన జరిగి మూడు రోజులు అవుతున్న కేసును కప్పిపుచ్చుతున్నారని, కీచక ప్రిన్సిపల్ ని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాల గుర్తింపు వెంటనే రద్దు చేసే వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, తరంగ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.