calender_icon.png 20 October, 2024 | 6:30 PM

మునుగోడులో దళారులు చెప్పిందే ధర

20-10-2024 01:29:51 AM

మునుగోడు, అక్టోబర్ 19: నల్లగొండ జిల్లా మునుగోడు నియెజకవర్గంవ్యాప్తంగా ఈ ఏడాది వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. పంట చేతికొచ్చిన సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో గత్యంతరం లేక రూ.5,800 నుంచి రూ.6,300 వరకు దళారులు చెప్పిన ధరకు విక్రయిస్తున్నారు. పంట చేతికొచ్చే సమయానికి రూ.7,000 పైచిలుకు ధర పలకడంతో రైతులు సంబురపడ్డారు. కానీ కేంద్ర ప్రభుత్వం సీసీఐ కేంద్రాలు ప్రారంభింకపోవడంతో దళారులే దిక్కయ్యారు. తేమ సాకుతో దళారులు క్వింటాకు రూ.1,500 తగ్గించడంతో రైతులు దిగులు చెందుతున్నారు.

ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ధర్నాలు, రాస్తారోకోలు చేసే కమ్యూనిస్టులు నేడు మూగబోయారు. ప్రభుత్వాలు మారినా తమ గోడు మాత్రం తీరడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా మునుగోడు మండల వ్యాప్తంగా 38 వేల పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగు అయినట్టు మండల వ్యవసాయ అధికారిని పద్మజ తెలిపారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై సంబంధిత అధికారుల నుంచి సమాచారం అందిన వెంటనే రైతులకు తెలియజేస్తామని చెప్పారు.

15 రోజుల తర్వాత డబ్బులు..

మునుగోడులో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో రైతులు విక్రయించిన పత్తికి ఒక్క శాతం కోత విధిస్తున్నారు. కోత లేకుంటే 15 రోజులకు డబ్బులు తీసుకోవాలలని యజమానులు అనడంతో దిక్కుతోచక తీసుకుంటున్నారు. ఇప్పటికే వర్షాలు కురిసి దిగుబడులు సరిగారాక గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతుంటే మిల్లుల యాజమాన్యం వారిపైన ఫైనాన్స్ వ్యాపారం చేయడం బాధాకరం.