రూ.కోట్లు గడిస్తున్న ‘కమ్యూనికా’ సంస్థ
రోమ్, నవంబర్ 17: దశాబ్దాల క్రితం తాగునీటిని కొనే రోజులు వస్తాయంటే ఎంతోమంది నమ్మలేదు. కానీ, 20 ఏళ్ల నుంచి తాగునీటి వ్యాపారం ఎంత పుంజుకున్నదో మనం చూస్తూనే ఉన్నాం. పుష్కలంగా మినరల్స్ ఉండే మినరల్ వాటర్‌ను ఆయా కంపెనీలు లీటర్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పైగా విక్రయిస్తున్నాయి. తద్వారా రూ.కోట్లు గడిస్తున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని విక్రయిస్తున్న ఓ కంపెనీ గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటలీకి చెందిన ‘కమ్యూనికా’ అనే సంస్థ లేక్ కోమో టూరిస్ట్ స్పాట్ నుంచి నింపిన గాలిని టిన్నుల్లో బంధిస్తున్నది. ఒక్కో టిన్నును భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.వెయ్యికి విక్రయిస్తున్నది. లేక్ కోమో ప్రపంచంలో అత్యంత అందమైన పర్యాటక ప్రాంతం. సరస్సు తీరంలో ఉండే ఈ ప్రాంతం స్వచ్ఛతకు మారుపేరు. ఇక్కడి గాలి, నీరు ఎంతో స్వచ్ఛం. ఆ బ్రాండ్‌ను క్యాష్ చేసుకుంటున్నది ‘కమ్యూనికా’ కంపెనీ. ఇప్పుడు లేక్ కోమోకు వెళ్లిన పర్యాటకులు మురిపెంగా గాలి టిన్నులు కొని తిరిగి స్వస్థలాలకు వెళ్తుండడం విశేషం.