17-12-2024 12:18:28 AM
జనగామ, డిసెంబర్ 16 (విజయక్రాంతి): జనగామ జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఈ ప్రాం తంలో ఎక్కువగా పత్తి, వరి పంటలు మాత్ర మే సాగు చేస్తుంటారు. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలతో అధిక లాభాలు గడించవచ్చని ప్రచారం చేయడంతో కొందరు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు.
నిత్యం వేసే పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. గతేడాది మంచి ఫలితాలే కనిపించినా ఈసారి మాత్రం పెట్టుబడి రావడం కూడా కష్టంగా కనిపిస్తోంది. గతేడాది వానకాలం, యాసంగి కలిపి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 1,030 ఎకరాల్లో, జనగామలో 260 ఎకరాల్లో, పాలకుర్తిలో 942 ఎకరాల్లో.. మొత్తంగా 2,233 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు.
ప్రస్తుతం వానకాలం సీజన్‌కు సంబంధించి కొనుగోళ్లు నడుస్తున్నాయి. వానకాలంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 615 ఎకరాల్లో, జనగామలో 103 ఎకరాల్లో, పాలకుర్తిలో 947 ఎకరాల్లో.. మొత్తంగా 1,216 ఎకరాల్లో మిర్చి సాగైంది. దిగుబడి ఆశించినట్లుగానే వచ్చినా రేటు మాత్రం పూర్తిగా పతనమైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సగానికి పడిపోయిన రేటు
జనగామ జిల్లాలో పండించిన పంటను వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో అమ్ముతుంటారు. జనగామ మార్కెట్‌లో మిర్చి కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు వరంగల్‌కు వెళ్లి తమ పంటను విక్రయిస్తుంటారు. గతేడాది మిర్చి పంటకు గిట్టుబాటు ధర రావడంతో ఈసారి కూడా రైతులు ఆ పంట వైపు మొగ్గు చూపారు. కానీ ప్రస్తుతం ఏనుమాముల మార్కెట్‌లో ధరల పట్టిక చూస్తే రైతు గుండె గుబేలుమంటున్నారు.
గతేడాది తేజ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.28 వేలు పలుకగా.. ఇప్పుడు రూ.15 వేలు కూడా దాటడం లేదు. 341 రకానికి గతేడాది క్వింటాల్‌కు రూ.26 వేలు పలుకగా.. ఇప్పుడు రూ.13 వేలకు పడిపోయింది. దాదా పు 50 శాతం ధర తగ్గిపోవడంతో మిర్చి రైతులు లబోదిబోమం టున్నారు. కనీసం తమకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కంటికి రెప్పలా కాపాడుకుంటే..
మిగతా పంటలతో పోలిస్తే మిర్చి సాగు చాలా శ్రమ, శ్రద్ధతో కూడుకున్నది. ఒక్క ఎకరాకు రూ.లక్షా 50 వేల వరకు పెట్టుబడి అవుతుంది. పెట్టుబడికి తోడు ఈ పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటేనే దిగుబడి వస్తుంది. తెగుళ్లు ఎక్కువగా సోకే అవకాశం ఉండటంతో రైతులు వారానికి రెండుసార్లు మందు కొడుతారు. దాదాపు 6 నుంచి 8 నెలల తరువాత పంట చేతికొస్తుంది.
ఇలా కంటికి రెప్పలా కాపాడుకుని దిగుబడికొచ్చిన పంటకు మార్కెట్‌లో సరైన ధర లేకపోవడంతో రైతు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది. కనీసం మార్కెట్‌లో డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకుందామనుకుంటే పంటను భద్రపరిచేందుకు కోల్డ్ స్టోరేజీ అందుబాటులో లేదు.
వీటిని ఏర్పాటు చేస్తామని ఎన్నో ఏళ్లుగా పాలకులు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానురాను మిర్చి పంటను సాగు చేసేందుకు ముందుకు రావడం కష్టమేనని రైతులు చెబుతున్నారు.
ఎనిమిది నెలల కష్టం వృథా
ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అధికారులు సూచిస్తే ఎంతో మంది రైతులు మిర్చి పంట వైపు చూశారు. నేను, మా కుటుంబ సభ్యులం కలిసి నాలుగెకరాల్లో మిర్చి పంట వేశాం. పంటను కోసి అమ్మకానికి సిద్ధంగా ఉంచాం. కానీ మార్కెట్‌లో రేటు చూస్తేనే భయమేస్తుంది. క్వింటాల్‌కు రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు మాత్రమే పలుకుతుంది. ఈ రేటుకు అమ్మితే మాకు పెట్టుబడి కూడా చేతికి రాదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి.
కుషాకర్, మిర్చి రైతు, జనగామ