calender_icon.png 21 September, 2024 | 3:12 AM

ధర తక్కువ.. తిప్పలే ఎక్కువ

28-07-2024 02:30:00 AM

యూడీఎస్ ప్రాజెక్టుల్లో  కొనుగోలు చేసి మోసపోతున్న ప్రజలు ప్రీలాంచ్ మోసాల్లో యూడీఎస్ ప్రాజెక్టులే అధికం గత ఐదేండ్లలో హైదరాబాద్‌లో రూ.10 వేల కోట్ల మోసాలు 

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 27 (విజయక్రాంతి): అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) ప్రాజెక్టుల్లో ధర తక్కువకు ప్లాటు లభిస్తుందని కొనుగోలు చేస్తే తిప్పలు తప్పవని, ప్రస్తుతం జరుగుతున్న ప్రీలాంచ్ మోసాల్లో మెజార్టీ ప్రాజెక్టులు యూడీఎస్ ప్రాజెక్టులేనని రియల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూడీఎస్ పద్ధతిలో ప్లాట్ల అమ్మకాలు చేయరాదని ప్రభుత్వం ఆదేశించినా.. కొందరు బిల్డర్లు పట్టించుకోవట్లేదు. తక్కువ ధరకే ఇల్లు అని ఆశలు చూపి, వినియోగదారులను బుట్టలో వేసుకుంటున్నారు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆ స్థలాలకు అనుమతులు రాక బిల్డర్లు సకాలంలో ఇళ్ల నిర్మాణం చేయలేకపోతున్నరు. దీంతో కోట్లు పోసి ప్లాట్లు కొన్నవారికి పాట్లు తప్పడం లేదు. ప్రీలాంచ్ మోసాల్లో యూడీఎస్ ప్రాజెక్టులే అధికంగా ఉన్నాయని, గత ఐదేళ్లలో హైదరాబాద్ కేంద్రంగా రూ.10 వేల కోట్ల విలువైన రియల్ మోసాలు జరిగాయని రియల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ఆశకు పోతే అసలుకే మోసం

యూడీఎస్ ప్రాజెక్టుల్లో భాగంగా స్థల యజమాని నుంచి డెవలపర్ కేవలం అగ్రిమెంట్ మాత్రమే చేసుకుని ఆ వెంటనే కస్టమర్లకు ప్లాట్లు అమ్మేస్తున్నారు. హైదరాబాద్‌లో సొంతిల్లు కొనాలనే సామాన్యుని కలలను ఆసరా చేసుకొని బిల్డర్లు, రియల్టర్లు యూడీఎస్ పద్ధతిలో స్థలాన్ని చూపించి ప్లాట్లను విక్రయిస్తున్నారు. ముందు వెనకా ఆలోచించకుండా అడ్వాన్సులు చెల్లించి రియల్టర్లతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ధర తక్కువే అయినప్పటికి స్థలానికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులొచ్చిన, నిర్మాణ అనుమతులు రాకపోయిన నష్టపోయేది కొనుగోలు దారులే. యూడీఎస్‌లో ప్లాట్లను కొనుగోలు చేస్తే కలిగే నష్టాలపై ప్రభుత్వంతోపాటు కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ చాలా సందర్భాల్లో హెచ్చరికలు జారీచేసింది.

రెరాలో నమోదైన ప్రాజెక్టుల్లో, రెరా అనుమతి పొందిన ఏజెంట్ల వద్ద మాత్రమే కొనుగోళ్లు చేయాలని సూచిస్తున్నా, ఆశకు పోయి ప్రజలు అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారు. మార్కెట్‌లో చదరపు అడుగు రూ.5 వేల వరకు ధర ఉంటే కేవలం రూ.3వేలకే చదరపు అడుగు అని చెప్తూ 60 రోజుల్లో మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.౨ వేలు తక్కువ రావడంతో వినియోగదారులు ఎగబడి మరీ కొంటున్నారు. కనీసం రెండు నుంచి నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసి ఇంటిని అప్పజెప్పుతామని డెవలపర్ చెప్తున్నారు. కానీ, యూడీఎస్ ప్రాడెక్టులకు అనుమతులు రాకపోవడంతో చాలా వరకు ముందుకెళ్లడం లేదు. దీంతో డబ్బులు కట్టిన వినియోగదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.