19-03-2025 01:02:57 AM
టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్
మహబూబ్ నగర్ మార్చి 18 (విజయ క్రాంతి) : బీసీల సంక్షేమాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విస్మరించిందని టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.20,69,588 కోట్ల బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం కేవలం 2శాతం అనగా కేటాయించిన రూ.41,484 కోట్లలో ఖర్చు చేసింది రూ.25,419 కోట్లు మాత్రమేనని విమర్శించారు. రూ.100లో 2 రూపాయల 22 పైసలు ఖర్చు చేశారన్నారు. మొత్తం బడ్జెట్లో పదేళ్లలో రైతుబందు, ఇతర పథకాలకు సంబంధించి రూ.81.668 కోట్లు కేటాయించి తమ పాలనలో 3.95 శాతం ఖర్చు చేశారని అన్నారు.
దీనిబట్టి బీసీల పట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. ఎంబీసీలకు సంబంధించి బీసీ కులాల కార్పొరేషన్కు రూ.3850 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది రూ.20 కోట్లు మాత్రమేనని ఎద్దేవాచేశారు. ఇదే తరహాలో అన్ని కార్పొరేషన్లకు నిధులు కేటాయించి ఖర్చు చేసింది నామమాత్రమేనని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో బీసీలకు స్వర్ణయుగమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. ఎంత జనాభా ఉంటే అంతే రిజర్వేషన్లు కల్పించాలన్న రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. కులగణన సర్వే ను తప్పు అని కేటీఆర్ అనడం సరికాదన్నారు. వెంటనే ఆయన సర్వే చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కెసిఆర్ కుటుంబం సర్వేలో పాల్గొనక పోవడం బీసీలను అవమానించినట్లేనని విమర్శించారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించే లో బాధ్యతను బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు ఎంపీలపై ఉందన్నారు.
ఈ బిల్లుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షులు చంద్రకుమార్ గౌడ్, మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు బెక్కరి మధుసూదన్ రెడ్డి, అజ్మత్‌అలీ, రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.