calender_icon.png 2 November, 2024 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్తమానమే వాస్తవం

19-07-2024 12:00:00 AM

వీయస్‌ఆర్ మూర్తి :

విషయవాంఛలను విష్ణువాంఛగా; అరిషడ్వర్గాలను హరిషడ్వర్గాలుగా మార్చుకుంటూ మనిషి, చిత్తశుద్ధిని తన సహజశక్తిగా, లక్షణంగా వినియోగించుకోవాలి. తద్వారా మోహక్షయాన్ని సాధించుకోవాలి. మోహ క్షయమే మోక్షం!

తనువుతో కూడి ఉన్నవన్నీ ఏదో ఒకనాడు ఊడిపోయేవే. వీడిపోయేవే. తనువుతో ఏర్పడే బాంధవ్యాలన్నీ తెల్లవారేవే. ఇదంతా వేదాంతమే. ‘కేనోపనిషత్’ బోధించేది ఇదే. జరుగుతున్నదంతా తన వల్లనేనన్న అహంకారంతో మనిషి తన మూలశక్తిని విస్మరిస్తుంటాడు. జరగని దానికంతటికీ ఎవరినో బాధ్యులను చేస్తూ ఆత్మవంచన చేసుకుంటాడు.

ఎదుగుతున్న కొద్దీ, ఎరుగుతున్న కొద్దీ జీవితానుభవాలు అంతరంగంలో తారాడుతున్నప్పుడల్లా తనను తాను విశ్లేషించుకునే దశలో, తాను నిమిత్త మాత్రుడనని, తనను ఏదో శక్తి నడిపిస్తున్నదని గ్రహిస్తాడు. మనసుకు లొంగకుండా ఆ స్పృహను విస్తృతం చేసుకుంటుంటే అభిజాత్యం నశించి, అహం స్ఫురణను అనుభవ పరిధిలోకి తెచ్చుకోగలుగుతాడు.

ఆ సందర్భంలోనే మనిషికి రెండు మార్గాలు ఎదురవుతాయి.

ఒకటి: తరించే మార్గం. 

మరొకటి: అంతరించే మార్గం. 

తరించే మార్గం సులభమైంది. 

అంతరించే మార్గం సంఘర్షణాత్మకం.

జీవిత సంగ్రామ రంగం వైరుధ్య సంభరితం. అన్ని వైవిధ్య వైరుధ్యాల మధ్య మనిషి తనను తాను సహజంగా నిలబెట్టుకోవాలి. భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక శక్తులను సమన్వయంగా సమపాళ్లలో వినియోగించగల నేర్పును మనిషి అలవరుచుకోవాలి. కర్తవ్య నిర్వహణా దక్షత, మనోలయం, ఆత్మ నిగ్రహం వంటి భౌతిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మికతలను వివరిస్తూ, ఇవన్నీ జయప్రదం కావటానికి ఆధార భూమిక నైతికత, శీలసంపద అవశ్యమని ‘కేనోపనిషత్’ బోధిస్తుంది. విషయవాంఛలను విష్ణువాంఛగా; అరిషడ్వర్గాలను హరిషడ్వర్గాలుగా మార్చుకుంటూ మనిషి, చిత్తశుద్ధిని తన సహజశక్తిగా, లక్షణంగా వినియోగించుకోవాలి. తద్వారా మోహక్షయాన్ని సాధించుకోవాలి.

మోహ క్షయమే మోక్షం! 

ఏతావాతా, మనిషి అన్నిటినీ అర్థం చేసుకుని ఆచరించవలసిన ఆధ్యాత్మ సాధనా రీతులను పునఃపునః స్మరించుకుంటుండాలి. జరుగుతున్న ప్రతి సంఘటనను సాక్షిగా చూడగలగటం, జరుగుతున్న ప్రతి విషయం వెనుక బలీయమైన ఏదో శక్తి ఉన్నదని గ్రహించగలగటం జీవితాన్ని ఆధ్యాత్మమయం చేసుకోగలగటం, జీవితాన్ని అధివాస్తవికంగా జీవించగలగటం, ఆశాభంగాలకు వేరెవరో కారణం కాదని, స్వీయ నిర్వహణా లోపమేనని గ్రహించి అలసత్వం వదులు కోగలగటం... వంటి ఆచరణీయ మార్గదర్శకాలను స్వీకరించగలిగితే ఆధునిక సమకాలీన సమాజం, భవ్య నవ్య దివ్య భవిష్యత్తును నిర్మించుకోగలదు. 

జరిగిపోయినదంతా స్ఫూర్తిప్రదం కావాలి. జరుగుతున్నదంతా ఆనందమయం కావాలి. అపుడు, జరగబోయేదంతా ఆశావహమై జీవితాన్ని నడిపిస్తుంది.