calender_icon.png 27 October, 2024 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిటిష్ కాలపు పద్ధతులను పక్కనపెట్టాలి

27-10-2024 12:17:30 AM

  1. వెట్టిచాకిరీ నుంచి మాకు విముక్తి కల్పించాలి
  2. ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలి
  3. బెటాలియన్ కానిస్టేబుళ్లు, కుటుంబ సభ్యుల ఆందోళన

విజయక్రాంతి నెట్‌వర్క్, అక్టోబర్ 26: రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని, తమపై పనిభారం తగ్గించాలని రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్ల పోలీసులు, వారి కుటుంబీకులు ఆందోళలను ఉద్ధృతం చేస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

అన్ని ఉద్యోగాల్లాగానే తమ పరిధిలోనూ ౮ గంటల పని విధానాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాలలోని ఫ్లు ఓవర్‌పై గుడిపేట 13వ బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ఐదేండ్ల వరకు ఒకే ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. ఆందోళనకారులకు మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

సిరిసిల్ల జిల్లాకేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కాళ్లపై పడి సర్దాపూర్ 17వ బెటాలియన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ వేడుకున్నాడు. తమ కు పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించాలని కోరాడు. కానిస్టేబుల్ వెంట తోటి కానిస్టేబుళ్లు సైతం ఉండి తమ సమస్యలను ఎస్పీకి దృష్టికి తీసుకొచ్చారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్డుపై బెటాలియన్ పోలీసులు, కుటుంబీకులు రాస్తారోకో నిర్వహించారు. పొరుగు రాష్ట్రాల్లో ఏక్ పోలీస్ విధానం అమలులో ఉందని, తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశా రు. బ్రిటిష్ కాలం నాటి విధి విధానాలకు పోలీస్‌శాఖ స్వస్తి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. బెటాలియన్ వ్యవస్థలో ఫటిక్ పేరుతో వెట్టిచాకిరీ అమలవుతోందని ఆరోపించారు.

ఆందోళనల వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు

డీజీపీ జితేందర్ అనుమానం

హైదరాబాద్ సిటీబ్యూరో: బెటాలియన్ పోలీసుల ఆందోళనల వెనక ప్రభుత్వ వ్యతిరేకశక్తుల ప్రేమయం ఉంద ని డీజీపీ జితేందర్ అనుమానం వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్లు ‘ది పోలీస్ ఫోర్సెస్ యాక్ట్’, ‘ది పోలీస్ యాక్ట్’, ‘పోలీసు మాన్యువల్’ ప్రకారం విధులు బహిష్కరించకూడదని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కానిస్టేబుళ్లు రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఆందోళన చేయడం సరికాదన్నా రు. కానిస్టేబుళ్ల చర్యలను క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణిస్తున్నామని ప్రకటించారు. ఉమ్మడి ఏపీలో అమలైన నిబంధనలు, ఇకపైనా అమలవుతాయని స్పష్టం చేశారు.