ప్రధాని మోదీకి గౌతమ్ అదానీకి మధ్య అంతర్గత సంబంధాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై బీజేపీ స్పందించింది. అమెరికా ప్రాసిక్యూటర్ల ఆరోపణల్లో వారు పేర్కొన్న సమయంలో ఒడిశాలో బీజేడీ, ఏపీలో వైసీపీ, తమిళనాడులో కాంగ్రెస్ మద్దతుతో డీఎంకే, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టు గుర్తు చేసింది.
జూలై 2021-ఫిబ్రవరి 2022 మధ్య కాలంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నట్టు వెల్లడించింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి నేరారోపణలతో సంబంధం ఎలా ఉంటుందని ప్రశ్నించింది. తమపై నేరారోపణలు చేసేముందు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు లంచాలపై సామాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
అంతేకాకుండా అదానీపై వచ్చిన అభియోగాలు ఇంకా రుజువు కాలేదని పేర్కొంది. నేరం రుజువయ్యే వరకు నిందితులుగానే పరిగణించాలే తప్ప దోషులుగా చూడొద్దని పేర్కొంది. విదేశీ నివేదిక ఆధారంగా ప్రతిపక్షాలు భారతీయ కంపెనీపై ఆరోపణలు చేయడంపట్ల బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది.
అదానీపై ఆరోపణలు రుజువైతే భారతీయ చట్టాల ప్రకారం చర్యలు తప్పవని వెల్లడించింది. అంతేకాకుండా పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు ఈ ఆరోపణలు రావడంపట్ల బీజేపీ అనుమానం వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే రాజకీయ కుట్రలో భాగంగానే సరిగ్గా శీతాకాల సమావేశాలకు ముందు ఆరోపణలను బహిర్గతం చేసినట్టు అభిప్రాయపడింది.