calender_icon.png 27 October, 2024 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే పదేండ్లు అధికారం మాదే

28-08-2024 01:16:07 AM

ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు

మాఫీ కాని రైతులు ఆందోళన చెందొద్దు

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేతలు ఎన్ని దుష్ప్ర చారాలకు ఒడిగట్టినా వచ్చే పదేండ్లు కాంగ్రెస్‌దే అధికారమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మీ ప్రజాకంటక పాలనకు విసుగు చెందే ప్రజలు మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారనే విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదని బీఆర్‌ఎస్ నేతలకు హితవు పలికారు. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రుణమాఫీపై అసత్యాలు ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాన్ని మానుకోకపోతే మీకే నష్టమని హెచ్చరించారు.

జనం అమాయకులేం కాదని, గతంలో మీరేం చేశారో.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో అన్నీ గమనిస్తూనే ఉన్నారని వెల్లడించారు. ఏవైనా సాంకేతిక కారణాల వల్ల అర్హులైన రైతులకు మాఫీ జరగకపోతే వాళ్లకు తప్పక న్యాయం చేస్తామని హామీఇచ్చారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ ఇచ్చింది తామేనని, బీఆర్‌ఎస్ నాయకుల మాయమాటలు నమ్మవద్దని సూచించారు. గతంలో రుణమాఫీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నాలుగేండ్ల తర్వాత సగం మందికి కూడా వర్తింప చేయకుండా గోసపెట్టిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీదని ఆరోపించారు.