calender_icon.png 22 February, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ పవర్ మనదే

20-02-2025 01:25:21 AM

కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది..

త్వరలో ఉపఎన్నికలు.. సిద్ధంగా ఉండండి

  1. సీఎంపై ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందనుకోలేదు
  2. ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ
  3. ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవాల నిర్వహణ
  4. బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం

* పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ప్రజలకోసం బీఆర్ఎస్ మాత్రమే పోరాటం చేయగ లదు. ప్రజల కష్టాలు బీఆర్‌ఎస్‌కు మాత్రమే తెలుసు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కి పోతున్నది. ప్రజలకు నచ్చి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు రాలేదు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోయిందని మన పార్టీ నాయకులే ప్రచారం చేశారు. అందుకే మన 10 మంది ఎమ్మె ల్యేలు కాంగ్రెస్‌లోకి మారా రు. ఒకసారి ఓడిపోతే కొట్టుకు పోయే పార్టీ కాదు బీఆర్‌ఎస్.

  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): త్వరలో రాష్ట్రంలో ఉపఎన్నికలు రావడం ఖాయమని, వాటిలో సత్తా చాటాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వందశాతం మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మనమే అంటూ ఉత్తేజం నింపారు.

కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతున్నదని, సీఎంపై ప్రజల్లో ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందనుకోలేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం లో, పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలకోసం బీఆర్‌ఎస్ మా త్రమే పోరాటం చేయగలదని కేసీఆర్ చె ప్పారు. ప్రజల కష్టాలు బీఆర్‌ఎస్‌కు మాత్ర మే తెలుసునని అన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కి పోతున్నద ని అన్నారు. ప్రజలకు నచ్చి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురాలేదని కేసీఆర్ చెప్పారు. ఒకవైపు సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, మరోవైపు ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు.

పార్టీ ఏర్పాటు చేసి 24 సంవత్సరాలు పూర్తి అయి, 25వ ఏటా అడుగుపెడుతున్న సం దర్భంగా రజతోత్సవాలను ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని నిర్ణయిం చారు. ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన ఏర్పా టు చేసిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, సిల్వర్ జూబ్లీ వేడుకలు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. 

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడు తూ.. తెలంగాణ సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవిం చిన బిడ్డ బీఆర్‌ఎస్ అని కొనియాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోయిందని మన పార్టీ నాయకులే ప్రచారం చేశారని, అందుకే మన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారారని నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకసారి ఓడిపోతే కొట్టుకుపోయే పార్టీ కాదు బీఆర్‌ఎస్ అంటే అని అన్నారు.  పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ర్టస్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని.. ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పనిచేయాలని సూచించారు.

స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని, శ్రేణులంతా కష్టపడి పనిచేయాలన్నారు. మనం ఏటా రాష్ట్ర ఆదాయం పెంచుకుంటూ వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆదాయం పడిపోతోందని, ఇప్పుడూ అదే అధికారులు ఉన్నా.. ఈ ప్రభుత్వానికి పనిచేయించుకోవడం రావడం లేదని విమర్శించారు. 

ఉప ఎన్నికలు తథ్యం..

‘రాష్ర్టంలో ఉప ఎన్నికలు వస్తాయి.. సిద్ధంగా ఉండాలి’ అని యువనేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘మళ్లీ మనదే అధికారం..మీరే ఎమ్మెల్యేలు..భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేయాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతుందని, పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఎన్నికలు వస్తాయి..’అని జోస్యం చెప్పారు. 

సభ్యత్వ నమోదు.. కమిటీలు ఏర్పాటు

ఏప్రిల్ పదో తేదీ నుంచి బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని.. ప్రతీ జిల్లా కేంద్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కొనసాగుతుందన్నారు. అనుబంధ సంఘాల పటిష్టత కోసం సీనియర్ నేతలతో సబ్ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. అదే నెల 10న పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందని చెప్పారు. పార్టీ కమిటీలు వేయాలని, కమిటీలకు ఇన్‌చార్జ్‌గా హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించారు.

త్వరలోనే మహిళా కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విద్యార్థి, మహిళా సహా పార్టీ అనుబంధ విభాగాలను మరింత పటిష్ట పరచాలని సూచించారు. అందుకోసం సీనియర్ పార్టీ నేతలతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించాలన్నారు. 

ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు.. 

బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక కేసీఆర్ పెద్దగా బయటకు రాలేదు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు. దీంతో పార్టీ శ్రేణులు, యువ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. సీఎం...సీఎం అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ భవన్ మొత్తం గులాబీ మయమైంది.

విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు రాష్ర్ట కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మాజీమంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు తదితర నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు.

పాలన అంటే టైంపాస్ ముచ్చట కాదు: కేటీఆర్ 

టైంపాస్ ముచ్చట్లు మాట్లాడటం, బజారు భాష మాట్లాడటం సులువే..కానీ పరిపాలన చేయడం కష్టమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, తెలంగాణ అస్తిత్వమే తమకు ముఖ్యమన్నారు. బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.. కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం కానివ్వబోమన్నారు.

పార్టీ బహిరంగసభ ఎక్కడ నిర్వహించాలో త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈఏడాది బీఆర్‌ఎస్‌కు చాలా కీలకమన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీ, అధ్యక్షుడి ఎన్నిక వంటివి కేసీఆర్ నేతృత్వంలో నిర్వహిస్తామన్నారు. పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.

కృష్ణా జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్ వ్యతిరేకించకుంటే తమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. బీసీ కులగణనను బీసీ సంఘాలే వ్యతిరేకించాయని, తన కులం, ఇతర వివరాలు ఎన్నికల అఫిడవిట్‌లో ఉన్నాయని చెప్పారు. అసలు సమస్యను పక్కనపెట్టి తాము సర్వేలో పాల్గొనలేదని పదేపదే కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం ప్రజలను పక్కదోవ పట్టించడమేనన్నారు.  సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి 30 సార్లు వెళ్లి ఏం చేశారని నిలదీశారు.