calender_icon.png 26 October, 2024 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోసాని చెరువును చెరబట్టారు

12-09-2024 12:00:15 AM

  1. శిఖం భూమిని ప్లాట్లు చేసి అమ్మిన రియల్టర్లు 
  2. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల్లో రికార్డులు మాయం 
  3. పట్టించుకోని అధికారులు

వికారాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి)/పరిగి: చెరువుల ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తమను అడిగేవారే లేరన్నట్లుగా కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో చెరువులను ఆక్రమించి వెంచర్లుగా మార్చి స్థలాలను విక్రయించడం నాయకులకు, రియల్టర్లకు వెన్నతో పెట్టిన విద్య గా మారింది. అధికారులను భయపెట్టించో, ఎంతోకొంత ముట్టజెప్పో తమ దారికి తెచ్చుకుంటున్నారు.

ఇంత బహిరంగంగా చెరువుల ఆక్రమణ జరుగుతుంటే గత పాలకులు ఏం చేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇలా చెరువులు, నాలాలు ఆక్రమించుకుంటూ నిర్మాణాలు చేపడితే ఏదో ఒక రోజు పరిగి కూడా వరదల్లో చిక్కుకోవాల్సిందేనని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. 

24 నుంచి 6 ఎకరాలకు..  

పరిగి మండలంలోని రూప్‌ఖాన్ పేట్‌లో పోసాని చెరువు శిఖం భూమిని ఆక్రమించి కొందరు రియల్టర్లు వెంచర్లు చేసి ప్లాట్లు అమ్మారు. ఈ తతంగమంతా గత 20 ఏళ్లుగా సాగుతోంది. చెరువు శిఖం భూమిలో ప్లాట్లు చేశారు కానీ చెరువు కట్ట ఆనవాళ్లను మాత్రం అలానే ఉంచారు. కళ్లకు కట్టినట్లు చెరువు ఆక్రమణ జరుగుతున్నా అప్పటి పాలకులు,  సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ చెరువు దాదాపు 6 దశాబ్దాల క్రితమే ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. చెరువు శిఖం మొత్తం 24 ఎకరాలు కాగా, ప్రస్తుతం 6 ఎకరాలు మాత్రమే మిగిలింది.

ఈ చెరువులోకి వచ్చే నాలాలను ముందుగా దారి మళ్లించిన రియల్టర్లు, కొంతకాలం తర్వాత ప్రణాళిక ప్రకారం చెరువు శిఖం భూమిని కబ్జా చేశారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా పోసాని చెరువులో పూడిక తీసేందుకు రూ.16.50 లక్షలు సైతం కేటాయించారు. పోసాని చెరువులో పూడిక తీసినట్లు  బిల్లులు కూడా చెల్లించారు. అయితే, మిషన్ కాకతీయలో పూడిక తీసిన పోసాని చెరువు ఇప్పుడు కనుమరుగైంది. రియల్టర్లు అక్రమంగా వెంచర్లు చేసి నాలాలను పూడ్చివేశారు. 

అధికారుల తీరుపై అనుమానాలు..  

రెండు అక్రమ వెంచర్లు చేసిన భూమి వంద శాతం పోసాని చెరువు శిఖం భూమి అని అధికారులకు తెలిసినా కనీసం చర్యలు తీసుకోలేదు. పైగా పోసాని చెరువుకు సంబంధించిన ఎలాంటి దస్తావేజు లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గాని, ఇరిగేషన్ శాఖలో గాని, రెవెన్యూలోగా గాని లేకుండా చేయడం గమనార్హం. చెరువుకు సంబంధించిన దస్తావేజులు ఒక శాఖలో లేకపోతే ఏమో అనుకోవచ్చు.. కానీ అన్ని శాఖల్లో లేకపోవడంపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.

అధికారులను రియల్టర్లు, ప్రజాప్రతినిధులు మచ్చిక చేసుకొని పోసాని చెరువు రికార్డులను మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా పరిగి పట్టణంలో చాలా చెరువుల దస్తావేజులు మాయం కావడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. 

ప్లాట్లు కొన్నవాళ్లకు ఇబ్బందులే.. 

పోసాని చెరువు శిఖం భూమిలో అక్రమంగా రెండు వెంచర్లు వెలిశాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ వెంచర్లు చెరువును తలపించాయి. ఈ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు భవిష్యత్‌లో ఇబ్బందులు పడక తప్పదని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తే ఎంతో మంది యజమానులకు నష్టం జరగక తప్పదని పేర్కొంటున్నారు. 

శిఖం భూమిని కాపాడాలి

పోసాని చెరువులో రెండు వెంచర్లు చేసి ప్లాట్లు అమ్మారు. ఇది పూర్తిగా శిఖం భూమి. ఈ విషయాన్ని అధికారులు, ప్రజాప్రతిని ధులు గుర్తించి శిఖం భూమిని రక్షించాల్సిన అవసరం ఉంది. పరిగి నియోజకవర్గంలో చెరువుల శిఖం భూములు, నాలాలు కబ్జా చేయడం అలవాటుగా మారిపోయింది. 

 పీర్ మహ్మద్, సీపీఐ పరిగి నియోజకవర్గ కార్యదర్శి