19-03-2025 01:36:50 AM
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజు
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 18 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీకే ప్రజాదరణ మెండుగా ఉందని, ప్రజలపక్షం వహించే పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు.
జగదల్పూరులో సమావేశం ముగించుకొని కొత్తగూడెం మీదుగా విజయవాడ వెళుతున్న క్రమంలో మంగళవారం సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయం ’శేషగిరిభవన్’ సందర్శించి జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతో సమావేశమయ్యారు. జిల్లా రాజకీయ పరిస్థుతలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా రాజా మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే ప్రజా పోరాటాలకు రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదర్శoగా నిలుస్తోందన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎందరో జాతీయ నాయకులను కమ్యూనిస్టు పార్టీకి అందించిందని, ప్రజా ప్రతినిధులుగా ప్రజా గొంతుకను వినిపించే నేతలను చట్టసభలకు పంపిందన్నారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లాలో పార్టీ విస్తరణకు, ప్రజా ప్రతినిధిగా ప్రజా సమస్యల పరిస్కారంకోసం నిత్యం శ్రమిస్తుండటం హర్షణీయమన్నారు.
జిల్లాలో ఉన్న పోడుభూముల సమస్యపై, పేదలకు నివేశన స్థలాలు కోసం, రైతాంగ, కార్మిక సమస్యలపై భద్రాద్రి జిల్లా కమ్యూనిస్టు పార్టీ బలమైన ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు. సకాలంలో 2025 సభ్యత్వం పూర్తి చేసి రాష్ట్ర కేంద్రానికి అందించడంపట్ల జిల్లా నాయకత్వాన్ని అభినందించారు.
సిపిఐ వందేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్బంగా దేశవ్యాపితంగా శత వసంతోత్సవాలు జరుగుతున్నాయని డిసెంబర్ 26వరకు ఉత్సవాలు జరుపుతామన్నారు. జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో భారీ భహిరంగ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అయన వెంట సిపిఐ జాతీయ నాయకులు రామకృష్ణ పాండే, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా ఉన్నారు