calender_icon.png 17 March, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టపోతున్నది పేదలే

16-02-2025 12:00:00 AM

తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే డబుల్ బెడ్ రూంలకు ఇందిరమ్మ ఇళ్లు అని పేరు పెడ్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రకటించారు. వెంటనే కేంద్ర మంత్రి గా ఉన్న బండి సంజయ్ గారు స్పందిస్తూ పేదలకు ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లు అని పేరు పెడ్తామని అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయమని కరాఖండిగా చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి పేరు అంటే వాళ్ల పేరు పెట్టొద్దని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న రేషన్ కార్డులలో తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఫోటోలు మాత్రమే ముద్రిస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో తప్పకుండా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ప్రజలకు ఆరు ఉచిత పథకాలు లేని పోని ఆశలు,ప్రలోభాలకు గురిచేసి మోసం చేసి ఎన్నికల లో గెలిచి అధికారంలోకి వచ్చిందని, అధికారం లోకి రాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శిస్తున్నారు.

రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పిందని, ఆచరణలో మాత్రం అమలు చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కూడా తక్కువేమీ తినలేదు. ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలకు సైతం దిగుతోంది.

ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఏ కార్యక్రమమైనా రాజకీయ ప్రయోజనాల కోసమే తపిస్తున్నట్లు కన్పిస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమమైనా ప్రధాన మంత్రి ఫొటో లేదని బీజేపీ నాయకులు గొడవ పడటం,బీజేపీ నాయకులు చేసిన కార్యక్రమాలలో ముఖ్యమంత్రి ఫొటో లేదని కాంగ్రెస్ నాయకులు గొడవ చేయడం జరుగుతోంది.

అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా అధికారంలో లేనప్పుడు మరో విధంగా మాట్లాడుతు ప్రజలను గందరగోళ పరుస్తున్నారు.రైతులను, మహిళలను, నిరుద్యోగులను, ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రతిపక్ష పార్టీల నాయకులు రెచ్చగొట్టి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా రాజకీయ పలుకుబడి సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను పేద, బడుగు, బలహీన వర్గాలకు దక్కకుండా చేసేఈ రాజకీయాలను ఇకనైనా ఆపాలి. రెచ్చగొట్టే మాటలతో అనుచరులను ఇంకా రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యవ్యవస్థలో మంచి పద్ధతి కాదు.

 డా.ఎస్.విజయభాస్కర్