calender_icon.png 15 November, 2024 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్రలో తనిఖీలపై రాజకీయం

14-11-2024 01:33:36 AM

సీఎం, కేంద్రమంత్రి బ్యాగ్‌ల తనిఖీ

ఉద్ధవ్ ఠాక్రే ఆరోపణల నేపథ్యంలో ఈసీ చర్యలు!

ముంబై, నవంబర్ 13: ఎన్నికల నేపథ్యంలో విపక్ష నేతల బ్యాగులను మాత్రమే తనిఖీ చేస్తారని వస్తోన్న ఆరోపణలు వెల్లువెత్తుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే బ్యాగులను అధికారులు బుధవారం చెక్ చేశారు. సీఎం షిండే పాల్ఘర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం హెలికాప్టర్‌లో షిండే వ్యక్తిగత సూట్‌కేస్‌తో పాటు సిబ్బంది సూట్‌కేసు లను సైతం పోలీసులు తనిఖీ చేశారు.

సిబ్బంది సూట్‌కేస్ తనిఖీ చేసే సమయంలో అందులో దుస్తులే ఉన్నాయని వారు వారించగా.. వాళ్ల డ్యూటీ వాళ్లు చేసుకోనియండంటూ షిండే వారికి సర్దిచెప్పారు. మరోవైపు పుణెకు వచ్చిన అథవాలే బ్యాగునూ ఎన్నికల అధికారులు చెక్ చేశారు. ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. 

విపక్షాలకేనా నిబంధనలు..

నేతల సామగ్రిని తనిఖీ చేయడం కేవలం విపక్షాలకే పరిమితంటూ ఇటీవల శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆరోపణలు చేశారు. యావత్మల్ ప్రచారంలో పాల్గొన్న ఉద్ధవ్ బ్యాగ్‌ను అధికారులు తనిఖీ చేయడంపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అధికారులు ప్రతిపక్షాలకు చెందిన నేతల ఇళ్లు, బ్యాగులనే పరిశీలిస్తున్నారని, అధికారంలో ఉన్న కూటమి నేతల విషయంలో నిబంధనలను అమలు చేయడం లేదని మండిపడ్డారు.

తనిఖీ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, సీఎం షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ బ్యాగులను తనిఖీ చేశారా? అని అధికారులను ఠాక్రే ప్రశ్నించారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న సీఈసీ రాజీవ్ కుమార్.. ఎన్నికల నిబంధనల మేరకు దేశంలోని అన్ని రాజకీయ నేతల హెలికాప్టర్లతో పాటు వ్యక్తిగత వస్తువులనూ పరిశీలిస్తామని పేర్కొన్నారు.  

బీజేపీని కుక్కతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సమర్థించుకున్నారు. ఓబీసీ కమ్యూనిటీని ఆ పార్టీ అవమానించిందని పేర్కొన్నారు. బీజేపీ ఓబీసీలను కుక్కలతో పోలుస్తోందనీ అందుకే తాను కూడా విమర్శించినట్టు వివరించారు. ఆయన బుధవారం మాట్లాడుతూ ఒకవేళ వాళ్లు మా కమ్యూనిటీని కుక్కలు అని అంటే నేనెందుకు మౌనంగా ఉండాలని ప్రశ్నించారు. ఓబీసీలను కుక్కలు అంటేనే తాను బీజేపీని కుక్కగా మారుస్తానని బదులిచ్చానన్నారు.

అకోలా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో తాజాగా పాల్గొన్న పటోలే అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఓబీసీలను కుక్కలుగా పిలిచే బీజేపీకి ఎన్నికల్లో ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు బీజేపీని కుక్కగా మార్చే సమయం వచ్చిందని విమర్శించారు. అంతేకాకుండా మహారాష్ట్రలో బీజేపీకి ఉన్న స్థానం ఏంటో తెలియజేయాలని ప్రజలను కోరారు. దీంతో వివాదం మొదలైంది.