సిద్దిపేట రూరల్, మే 17: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ గ్రామంలో శుక్రవారం జరుగుతున్న అంత్యక్రియలను పోలీసులు అడ్డుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్లాపూర్ గ్రామానికి చెందిన వల్లెపు శేఖర్ (24) కుటుంబ కలహాలతో ఈ నెల 11న గ్రామ శివారున పురుగుల మం దు తాగి ఆత్మాహత్యకు యత్నించాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని సిద్దిపేటకు తరలించారు. సిద్దిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందు తూ గురువారం రాత్రి శేఖర్ మృతి చెందాడు.
అయితే ఇలాంటి మృతదేహాలకు కచ్చితంగా పోస్టుమార్టం నిర్వ హించాల్సి ఉంటుందని, పోలీసు కేసు నమోదు అయితే తప్ప వైద్యులు పోస్టుమార్టం చేయారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా (మృతదేహానికి పోస్టుమార్టం చేయించకుండానే) శుక్రవారం మధ్యా హ్నం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపేందుకు సిద్ధం చేశారు.
విషయం తెలుసుకున్న చిన్నకోడూర్ పోలీసులు అక్కడికి చేరుకుని అంత్యక్రియలను అడ్డుకున్నారు. శవానికి పోస్టుమార్టం చేయించాలని ఆదేశించారు. దీంతో పోలీసులకు శేఖర్ కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగింది. కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం అనతంరం శుక్రవారం రాత్రికి శేఖర్ అంత్యక్రియలు నిర్వహించారు.