calender_icon.png 19 January, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులు బాధితుల పక్షాన నిలవాలి

08-08-2024 03:30:05 AM

ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమావేశంలో చైర్మన్ వెంకటయ్య

సిద్దిపేట, ఆగస్టు 7 (విజయక్రాంతి): సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమావేశం తూతూమంత్రంగా సాగింది. రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు ఈ సమావేశానికి హాజరు కాలేదు. 2021 నుంచి 2024 జూలై వరకు జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసులపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. 276 కేసులు నమోదు కాగా అందులో 216 మందికి మాత్రమే మొదటి దశ పరిహారం అందించారని, 2024 జనవరి నుంచి జూలై వరకు జిల్లాలో 48 అట్రాసిటీ కేసులు నమోదు చేయగా, 45 కేసుల్లో పోలీసుల చర్యలు అంతంత మాత్రమే ఉండడంపై కమిషన్ సభ్యులు ప్రశ్నించారు.

సమావేశానికి హాజరైన జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు భీమసేన, శంకర్ మాట్లాడుతూ.. తమ సమస్యలపై జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించడం లేదని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం త్వరగా అందించాలని ఆదేశించారు. పోలీసులు బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. సమావేశంలో కలెక్టర్ మను చౌదరి, కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్ కుమార్, కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, పోలీస్ కమిషనర్ అనురాధ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.