calender_icon.png 19 October, 2024 | 3:39 PM

పోలీసులు గుండు కొట్టించారని..

19-10-2024 12:42:33 AM

  1. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యాయత్నం?
  2. నాగర్‌కర్నూల్ జిల్లాలో తీవ్ర కలకలం

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని నలుగురు యువకులకు గుండు కొట్టించడం జిల్లాలో కలకలం రేపుతోంది. పోలీసుల చర్యతో తీవ్ర మనస్తాపానానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. దసరా పండుగ మరుసటి రోజు లింగాలలోని ఓ పెట్రోల్ బంక్ యజమానితో అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు గొడవకు దిగారు. బంక్ నిర్వాహకుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులే స్వయంగా శిక్ష విధించారని గ్రామస్థులు ఆరోపించారు.

మద్యం మత్తులో యువకులు కాలర్ ఎగరేస్తూ మాట్లాడటంతో పోలీసు అహం దెబ్బతిని.. నలుగురికి గుండుకొట్టించినట్టు తెలిసింది. అవమాన భారంతో యువకులంతా బయట తిరగలేక ఇంట్లోనే ఉంటున్నారు. గురువారం రాత్రి ఓ యువకుడి తండ్రి పని చేసుకోవాలని మందలించడంతో శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వెంటనే గమనించి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ విషయంపై లింగాల పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి సంబంధం లేదంటూ దాటవేయడం గమనార్హం.