calender_icon.png 9 January, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు!

08-01-2025 12:00:00 AM

‘తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే.. ఏ విద్యారంగం కోసమైతే.. మేం తపనపడి పోరాటం చేశామో.. ఆ విద్యారంగాన్ని కేసీఆర్ విధ్వంసం చేశారు. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని చరిత్రలో లేకుండా చేయాలన్న కుట్ర చేశాడు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విద్యా రంగానికి 14 శాతం బడ్జెట్‌లో కేటాయించేది. కానీ తెలంగాణ వచ్చాక అది ఆరు, ఏడు దాటలేదు. బహుశా విద్యారంగానికి ఉన్న ప్రాముఖ్యత కేసీఆర్‌కు తెలుసు. విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తే ప్రశ్నిస్తారు.. ఆ ప్రశ్నించేతత్వాన్ని ఆయన జీర్ణించుకోలేడు కాబట్టి..

విద్యారంగం మొత్తాన్ని విధ్వంసం చేయడం జరిగింది’ అని చెబుతున్నారు మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకుడు స్టాలిన్. ఓయూ కేంద్రంగా జరిగిన ఉద్యమ అనుభవాలను ‘విజయక్రాంతి’తో పంచుకున్నారు..

మలిదశ ఉద్యమ సమయంలో ఘర్షణలు నిరంతరం క్యాంపస్‌లో జరిగేవి.  మలిదశ ఉద్యమ సమయంలో విపరీతంగా విద్యార్థులపై లాఠీ చార్జీలు జరిగాయి. కొన్ని సంవత్సరాల పాటు విద్యార్థులు కూడా తమ విలువైన జీవితాన్ని, చదువును కూడా కోల్పోయారు. ఆ ఘటనలు నాపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. విద్యార్థుల మీద  తీవ్రమైన దాడి జరిగింది.

కర్కశంగా ప్రవర్తించారు పోలీసులు. ఆ ఘటనలు తెలంగాణ సమాజాన్ని కదిలించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే.. విద్యా రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.. మన బడ్జెట్ మనమే కేటాయించుకోవచ్చు.. అనే ఒక ఆలోచనతో విద్యార్థి సంఘాలుగా ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాం. 

విద్యుత్ చార్జీల పోరాటం

ముఖ్యంగా తెలంగాణలో ప్రాజెక్టులు లేకపోవడం వల్ల బావులపై ఆధారపడి వ్యవసాయం చేసేది రైతులు. దాంతో విద్యుత్ రంగంలో వచ్చిన మార్పులు.. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సంస్కరణల మూలంగా చాలామంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కరెంట్ బిల్లులు కట్టలేక.. మోటార్లు తీసుకుపోయే పరిస్థితి ఆరోజు అధికారులు కొనసాగించారు.

దానికి తోడు విపరీతమైన బిల్లులు వేయడం.. రైతులను పట్టించుకోకపోవడం.. మద్దతు ధర కల్పించకపోవడం లాంటి సంఘటనలు చాలా జరిగాయి. దానికి ‘విద్యుత్ చార్జీల పోరాటం’ అనేది ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మొత్తంగా రాజకీయ రంగంలో జరుగుతున్నటువంటి.. చిన్నచూపు కావచ్చు..

లేదంటే సంస్కృతి పరమైనటువంటి పండుగల పట్ల చూపే వివక్ష కావచ్చు.. భాష విషయంలో కావచ్చు.. ఇటువంటివి నిరంతరంగా కొనసాగించిన క్రమంలోనే మళ్లీ తెలంగాణ ఉద్యమం అనేది తార స్థాయికి చేరింది.

అట్ల 1990 తర్వాత ప్రారంభమైన ఉద్యమం 2001 ఒకటి నాటికి టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ ఆవిర్భావానికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం, జర్నలిస్టులు, కళాకారులు.. వివిధ రంగాలకు సంబంధిం చిన వాళ్లందరు కూడా ఏకం అయ్యారు. 

సిద్దిపేటలో బహిరంగ సభ

2009 వచ్చే నాటికి 14 ఎఫ్‌ను తొలగించాలని డిమాండ్‌తో ఉద్యోగులకు సంబంధించిన అంశం ముందుకు వచ్చింది. అప్పుడే సిద్దిపేటలో బహిరంగ సభ జరిగింది. మరోవైపు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష పోతున్నానని పిలుపు నివ్వడం.. దానికి అనుబంధంగానే.. అనుకులంగానే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు దీక్షకు మద్దతు తెలిపారు.

ఆ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పది విద్యార్థి సంఘాలు ఒక చోట కూర్చోని.. కేసీఆర్ దీక్షకు పోతున్నాడు కాబట్టి.. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో విద్యార్థి సంఘాలుగా ఆరోజు ర్యాలీ నిర్వహించాం. 

ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పాటు మమ్మల్ని అరెస్టు చేశారు.  కేసీఆర్ దీక్షకు పోయే క్రమంలో ఓయూ విద్యార్థి జేఏసీ ఏర్పాటు జరిగింది. ఓయూలో విద్యార్థి జేఏసీ ఏ పిలుపునిచ్చిన.. ఆ పిలుపునందుకుని గ్రామాల్లో కార్యక్రమాలు జరిగేవి. 

చలో అసెంబ్లీ..

తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలనే డిమాండ్‌తో ఓయూ విద్యార్థి జేఏసీగా.. అన్నీ సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాం. తర్వాత డిసెంబర్‌లో ఆర్ట్ కాలేజీ దగ్గర టెంట్ వేసి.. ఉద్యమాన్ని నడిపించాం. అలా ప్రతిరోజూ అక్కడి నుంచే పిలుపునిచ్చేది. డిసెంబర్ పదిన.. చలో అసెంబ్లీ అని పిలుపు నివ్వడంతో మమ్మల్ని అరెస్టు చేసి జైలుకు పంపిచారు.

అయితే విద్యార్థి ఉద్యమం బలంగా నడుస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్టు చెప్పడంతో.. పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఇది డిసెంబర్ పదికి సంబంధించిన విషయం. తర్వాత మళ్లీ తెలంగాణ ప్రక్రియను 23 తర్వాత వెనక్కి తీసుకోవడం.. తర్వాత యూనివర్సిటీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చి.. పెద్ద గొడవ చేశారు.

అదే రోజు నాగం జనార్థన్ రెడ్డి మీద దాడి జరిగింది.. ఆ కేసులో మమ్మల్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. విద్యార్థి గర్జన సమయంలో మేం జైలులోనే ఉన్నాం. మళ్లీ జనవరి 17 నుంచి ఫిబ్రవరి 7 వరకు బహిరంగ సభ ‘పోలి కేక’ కాకతీయ యూనివర్సిటీలో విజయవంతం చేశాం. 

పార్లమెంట్ ముందే కాల్చేశాం..

చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్, జంతర్ మంతర్, ఏఐసీసీ కార్యాలయం ముందు శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును తగులపెట్టాం. జేఎన్‌యూలో ర్యాలీ, ధర్నాలు నిర్వహించాం. ఆ కమిటీ రిపోర్టు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నది. తెలంగాణకు కమిటీ వేయాల్సిన అవసరం లేదు. ఒక్క అంశంగా తెలంగాణకు సంబంధించి పెట్టి.. మీగతా అన్ని.. తెలంగాణకు వ్యతిరేఖంగా ఉండటం వల్ల కమిటీ రిపోర్టు కాల్చడం జరిగింది.   

150 వరకు కేసులు..

విద్యార్థి జేఏసీగా ఆర్ట్ కాలేజీ ముందు టెంట్ వేసుకుని ఉద్యమాన్ని నడిపిస్తున్న క్రమంలో పోలీసులు మఫ్టీలో రావడం, కొంతమంది ఫొటోగ్రాఫర్ల రూపంలో.. బయటి వ్యక్తులను క్యాంపస్‌లోకి తీసుకొచ్చారు. ఆ సమయంలోనే మఫ్టీ పోలీసుల మీద పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఆ దాడి కేసులో మమ్మల్ని అరెస్టు చేశారు. అలా మా మీద 307 అటెంప్ట్ టు  మార్డర్ కేసు పెట్టారు.

ఆ కేసులో మేం రిమాండ్ అయి జైలుకు వెళ్లాం. అలా నామీద 150 వరకు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఏక్కడ సంఘటనలు జరిగిన కూడా ఓయూ జేఏసీ నాయకులపైన కేసులు నమోదయ్యేవి. ఆ సమయంలో మేం ప్రధానంగా ఎదుర్కొన్నది ఏమిటంటే.. పోలీసుల నుంచి బాగా బెదిరింపులు.. మరొకటి హాస్టల్స్, మెస్‌లు మూసివేశారు.

మెస్‌లు మూసివేస్తే.. మేం అడ్వాకేట్‌ల సహాయం తీసుకుని పోయేది. అప్పటికే అడ్వకేట్‌లు ఉద్యమానికి మద్దతు నివ్వడం జరిగింది. చాలా సందర్భాల్లో విద్యార్థుల

పై లాఠీ చార్జీలు జరిగినప్పుడు అడ్వకేట్‌లు మమ్మల్ని ప్రొటెక్టు చేశారు. 

క్యాంపస్‌లో క్యాంపులు

ఓయూ క్యాంపస్ లోపల సీఆర్‌పీఎఫ్ క్యాంపులు ఉండేవి. సీఆర్‌పీఎఫ్ పోలీసులు హాస్టళ్ల మీదపడి దాడి చేయడం.. ఆర్ట్ కాలేజీ దగ్గరకు రాన్వికపోవడం.. అలా తీవ్రమైనటువంటి భయందోళనలు సృష్టించారు. విద్యార్థులు రోడ్ల మీదకు రాకుండా.. బయట కనిపిస్తే లాఠీ చార్జీలు చేసేది. అమ్మాయిలనైతే భూతు పదాలతో తిట్టడం.. కొట్టడం జరిగింది.

వాళ్లు ఎంత భయపెట్టిన.. విద్యార్థులు ఏ మాత్రం తగ్గలేదు. పోలీసులు వేసుకున్న గూడారాలు ఏత్తేయేడం.. తగలబెట్టం వంటివన్నీ చేశాం. ఆ క్యాంపులను విద్యార్థులు మొత్తం తగలబెట్టడం జరిగింది. హైకోర్టు కూడా తర్వాత హాస్టల్స్ నడిపించాలని తీర్పు ఇవ్వడం జరిగింది.

అయితే పోలీసోళ్లు మధ్యరాత్రి పన్నెండు గంటలకు ఇండ్లళ్లకు పోవడం, తల్లిదండ్రులను భయపెట్టడం.. ఆరోజు ఐజీగా ఉన్నటువంటి అనురాధ ప్రెస్ మీట్‌లు పెట్టి.. పిల్లల్ని తీసుకుపోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉన్నది.. వాళ్లకు ఏం జరిగిన మాకు సంబంధం లేదనడం.. విద్యార్థి నాయకుల ఇండ్లలోకి వచ్చి ఫొటోలు ఉంటే తీసుకోవడం.. వంటి ఇబ్బందులకు గురి చేశారు. 

కొత్త కేసులు పెట్టారు..

తెలంగాణ వచ్చాక ఉద్యమకారులపై ఉన్న కే సులన్నీ కొట్టేశారు. కొంతమందిపై అలాగే ఉన్నా యి. చాలా కేసులు కొట్టేశారు. మరో విషయం ఏంటంటే.. తెలంగాణ ఏర్పాడ్డక మళ్లీ కొత్తగా కేసులు పె ట్టారు. చాలామంది విద్యార్థులు పాస్ పోర్టులు రాక చాలా ఇబ్బందుకు ఎదుర్కొన్నారు. ఆరోజు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలేవి నెరవేరలేదు.

విద్యార్థి నాయకులంతా కలిసి ఈటల రాజేందర్‌ను, కేటీఆర్‌ను కలిసి కొన్ని ప్రపొజల్స్ అయితే పెట్టారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులకు ఇచ్చిన బెనిఫిట్స్ ఇక్కడ కూడా అమలు చేయాలి అని కోరారు.. కానీ ఏమి నెరవేరలేదు.

ఈ ప్రభుత్వం 200 గంజాల స్థలం ఇస్తామని చెబుతున్నది. దానికి అబ్లికేషన్స్ కూడా స్వీకరించారు. గత ప్రభుత్వం అయితే ఏమి చేయలేదు. సంక్షేమ పథకాలను పక్కకు పెడితే.. కనీసం ఉద్యమకారులకు గుర్తింపే లేదు కదా.

 రూప