- మహిళలు, పిల్లల భద్రతకే తొలిప్రాధాన్యం
- పరిస్థితులకు అనుగుణంగా సినీనటులు వ్యవహరించాలి
- స్పష్టంచేసిన డీజీపీ డాక్టర్ జితేందర్
కరీంనగర్, డిసెంబరు 22 (విజయక్రాం తి): పోలీసులు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, పౌరుల భద్రత తమకు ముఖ్యమని డీజీపీ డాక్టర్ జితేందర్ స్పష్టంచేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడు తూ.. సమాజంలో శాంతిభద్రతలు పరిడవిల్లాలంటే పౌరులు బాధ్యతాయుతంగా వ్యవ హరించాలని కోరారు.
పోలీసులకు అన్ని వర్గాలు సమానమేనని.. సినీ నటులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థం చేసుకొని, అందుకు తగ్గట్టు వ్యవహరించాలని సూచించారు. సినిమా ప్రమోషన్ల కంటే పౌరుల భద్రత, రక్షణయే తమకు మొదటి ప్రాధాన్యమని ఉద్ఘాటించారు. ఇలాంటి ఘటనలు జరగడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్త్రీ, పిల్లల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని, అందువల్లే ప్రతి జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో 20 ఎస్సీ కార్యాలయాలు, మరో తొమ్మిది కమిషనరేట్లు ఉన్నాయని, ఇప్పటివరకు 27 భరోసా కేంద్రాలను ప్రారంభించినట్టు డీజీ పీ వెల్లడించారు. కరీంనగర్‌లో భరోసా కేంద్రాన్ని నిర్మించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియీ సీఎస్ నిధులను వెచ్చించి దాదా పు 6,800 చదపు అడుగుల భవనాన్ని నిర్మించిందని పేర్కొన్నారు. భరోసా కేంద్ర సేవలను వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో నక్సలిజం లేదని తాము భావించడం లేదని, ఇక్కడివారు పొరుగు రాష్ట్రాల్లో నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు.
సినీనటుడు మోహన్ బాబు విషయంలో చట్ట ప్రకారమే నడుచుకుంటామని డీజీపీ స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఐజీ రెమా రాజేశ్వరి, సీపీ అభిషేక్ మొహంతి, ట్రైనీ ఐపీఎస్ యాదవ్ వసుంధర, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్ శ్రీలత, ఎస్‌ఐబీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.