కాసె సర్వప్ప
“ఇది శ్రీ సకల విద్వదిభపాద కమల
సదమల సేవన సభ్య సంస్మరణ
భాసుర సాధు భావన గుణానూన
భూసురాశీర్వాద పూజనీయుండు
కాసె మల్లన మంత్రి ఘన కుమారుండు
వాసిగా జెప్పె సర్వప్పనునతండు”
అంటూ మంజరీ ద్విపద కావ్యంగా తెలుగు రాజులైన కాకతీయ ప్రభువుల చరిత్రను తెలుగు ఛందస్సుల్లో ఒకటైన ద్విపదలో ‘సిద్ధేశ్వర చరిత్ర’ను రచించిన కవి కాసె సర్వప్ప మాటలనుబట్టి ఆయ న తండ్రి కాసె మల్లన్నగా తెలుస్తున్నది. ఇదే కావ్యాన్నిబట్టి కాసె సర్వప్ప ముత్తాత పేరుకూడా మల్లన్నయే. ముత్తాతను గురించి చెప్పినట్లు కనిపించే ద్విపదనుబట్టి అతడు-
“...బయకారములు పెక్కు
పద్యకావ్యములు
నయమొప్పజెప్పు నాగరకుడు”
గా తెలుస్తున్నది. తండ్రి అ యిన కాసె మల్లన కూడా గానవిద్యలో ఆరితేరిన వాడే. ఈ గ్రంథకర్త అయిన సర్వప్ప మాత్రం తానంతంగా చ దువుకున్న వాడను కానని స్పష్టంగా చె ప్పుకున్న సత్యనిష్ఠ కలిగిన కవి. కేవలం సిద్ధేశ్వర స్వామి కరుణవల్లనే తనకు కవిత్వం వచ్చిందని స్వయంగా చెప్పుకున్నాడు.
“శబ్ద సంగతులను శాస్త్రాది విమల
శబ్ద లక్షణములు చర్చించి యెఱుగ
నాటకాలంకార నవ్యరీతులను
కూటవఱంకువుల్ గుణదోషచ్ఛంద
వాటంబులేమియు వరసతో నెఱుగ..
లబ్ధ ప్రసాదుండ సిద్ధేశు కరుణ”
అని స్పష్టంగా చెప్పుకున్న ఆయన మాటలనుబట్టి సర్వప్ప వ్యాకరణ ఛందో విషయాల్లో తనకు సరైన ప్రతిభ లేకున్నా సిద్ధేశ్వరుని కరుణా కటాక్షాలవల్ల మాత్ర మే ఈ రచన చేపట్టినట్లు చెప్పుకున్నాడు. ఈ కారణంగా ఈ కావ్యంలో కనిపించే దోషాలను మనం పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు.
పలువురు సాహి తీ చరిత్రకారులు పేర్కొన్నట్లు ఇందులో ఛందోదోషాలు, వ్యాకరణంలోని అపప్రయోగాల వంటివి వదలి, దీనినొక ప్రత్యేకమైన చారిత్రక కావ్యంగానే చూడాలన్న మాటను అంగీకరించాలి. తెలుగు రాజులైన కాకతీయుల చరిత్ర ను తెలుగు ఛందోవిశేషమైన ద్విపదలో చెప్పడం గమనిస్తే సర్వప్పకు తెలుగుతనంపై ఉన్న మమకారం అర్థమవుతున్నది.
ద్విపద చ్ఛందంలో ‘సిద్ధేశ్వర చరిత్ర’
కాసె సర్వప్ప ‘సిద్ధేశ్వర చరిత్ర’ రచన ద్విపద చ్ఛందంలో జరిగింది. ద్విపద తెలుగు ఛందోరీతుల్లో ఒక ప్రత్యేకత కలిగిన ఛందో విశేషం. దీంట్లోకూడా సర్వ ప్ప మంజరీ ద్విపదలో ఈ రచన చేశా డు. అప్పటికే పాల్కురికి సోమనాథుని కారణంగా ద్విపదకు తెలుగునాట విస్తృ త ప్రచారం లభించింది. ఆయన రచించిన ‘బసవ పురాణం’, ‘పండితారాధ్య చరిత్ర’ల ప్రభావం ద్విపద కావ్యాలపై ఉంది. తెలుగు ప్రజలు ద్విపదను ఆదరించారు.
సర్వప్ప తెలుగు రాజుల చరిత్ర చెప్పడానికి తెలుగు ఛందస్సునే ఎన్నుకోవడం విశేషం. పెద్దగా ఛందో విషయం లో తనకంత ప్రతిభ లేదని తెలిసినా, అ క్కడక్కడా విషయాన్ని గద్యంలో చెప్పి నా, కావ్యమంతా ద్విపదలోనే చెప్పాల న్న ఆయన సంకల్పం, చిత్తశుద్ధి గొప్పవి. వ్యుత్పత్తి కొంత తక్కువైనా, అభ్యాసానికి కొంత ఆటంకమైనా కావ్య నిర్మాణం చే పట్టగలిగిన ప్రతిభ మాత్రం కాసె సర్వప్ప కు తగినంతగానే ఉంది. ఈ విషయాన్ని ‘సిద్ధేశ్వర చరిత్ర’ నిరూపిస్తున్నది.
ఈ కావ్యంలో కవి ఏకామ్రనాథుని ప్రతాప చరిత్ర కథనే మూలంగా గ్రహించినా ప్రథమాశ్వాసంలో శివపార్వతుల కల్యాణాన్ని వర్ణించాడు. శివపార్వతులు కైలాసం వదలి లోకానుగ్రహార్థం హనుమాద్రికి వచ్చి స్థిరపడిన విశేషాలు, సిద్ధే శ్వర స్వామి ఆవిర్భావ అంశాలను విపులంగానేకాక అద్భుతంగానూ వర్ణించా డు.
అంతేగాక, పార్వతీ పరమేశ్వరుల వి వాహ వృత్తాంతాన్ని వర్ణించే సందర్భం తెచ్చి పెట్టి చరిత్రకు కావ్య సౌందర్యం జో డించాడు సర్వప్ప. ఈ కథను సర్వప్ప ‘కుమార సంభవం’, ‘శివ పురాణాల’నుంచి స్వీకరించి ఇందులో జోడించాడు.
చరిత్రకారులకు విషయ సంపద
‘సిద్ధేశ్వర చరిత్ర’ కావ్యం చరిత్రకారులకు చాలా విషయ సంపదను అందించింది. ఇందులో నెల్లూరు నుంచి తిక్కన మహాకవి వచ్చి గణపతి దేవుని సభలో మహాభారత పఠనం జరిపినట్లు చెప్పే కథ ఇందులో గ్రంథస్థమైంది. కాకతీయ పాలకులలోని వాడైన రెండవ ప్రతాపరుద్రుని చరిత్ర సవిస్తరంగానూ ఇందులో కవి గ్రంథస్థం చేశాడు.
మహమ్మదీయ రాజుల దాడులు, ఏడోసారి జరిగిన మహమ్మదీయుల దాడిలో ప్రతాపరుద్ర చక్రవర్తి బందీ కావడం, తర్వాత విముక్తుడు కావడం, పిదప ఆ చక్రవర్తి గోదావరి నదిలో ఐక్యం కావడం వంటి పలు విశేషాలను ఈ కావ్యమే వ్యాప్తిలోకి తెచ్చిందని సాహిత్య చరిత్రలు పేర్కొంటున్నాయి.
అంతేగాక, ఈ ‘సిద్ధేశ్వర చరిత్ర’లో నాటి ఓరుగల్లు వైభవం ప్రత్యేకంగా పే ర్కొన వలసిన అంశం. ఆ కాలంలో నిర్మితమైన గుళ్లు, గోపురాలు, ఇక్కడ కనిపిం చే వివిధ వర్ణాల ప్రజలు వారి వ్యవహారాలు, ఆనాటి ఉద్యోగులు వారి విశేషా లు, అప్పటి ప్రసిద్ధ కవులు వారి సంగతుల వంటి అనేక సామాజికాంశాలు చోటు చేసుకోవడం వల్ల కూడా.
ఈ కావ్యానికి కొంత ప్రామాణికత ఏర్పడింది. అయితే, ఏకామ్రనాథుని ‘ప్రతాప చరిత్ర’లోని అనేక దోషాలూ ఇందులో చోటు చేసుకోవడం మాత్రం తప్పలేదు. పూర్తిగా ఆ ‘ప్రతాప చరిత్ర’ గ్రంథంపై ఆధారపడి చేసిన రచన గనుక ఇది ఆ దోషాలనుకూడా పునరావృతం చేసింది.
కాసె సర్వప్ప అసమగ్రంగా రూపొందించిన ఈ ద్విపద కావ్యం (సిద్ధేశ్వర చరిత్ర) 17వ శతాబ్దికి చెందిందిగా, ఏకామ్రనాథుని ‘ప్రతాప చరిత్ర’ 16వ శతాబ్ది కాలానిదిగా ఆచార్య ఎస్.వి.రామారావు అభిప్రాయపడ్డారు. ఐతే, అప్పటికే బాగా ప్రభావం చూపిన పాల్కురికి సోమన రచనలతోపాటు నాటి శివకవుల ప్రభావం కూడా సర్వప్పపై కొంత పడింది.
శివకవుల వలెనే పౌరాణిక కథనాలను పక్కకు పెట్టి వర్తమాన వీరుల వృత్తాంతాలనో, పాలకుల చరిత్రనో వస్తువుగా స్వీకరించడమే ఈ కాసె సర్వప్పలోనూ కనిపిస్తున్నది. కాని, వీలైనంత వరకు శివభక్తుల కథలకు శైవకవులు ప్రాధాన్యమిస్తే సర్వప్ప మాత్రం ప్రజాపాలనా తత్పరులైన పాలకుల చరిత్రకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చాడు.
సిద్ధేశ్వరునికే అంకితం
కాసె సర్వప్పది ఉన్నత లక్ష్యం కలిగిన ప్రతిభ. పైగా కవిత్వం పవ్రితమైందన్న భావన ఆయనలో ఉంది. అందుకే, ప్రథామాశ్వాసంలోనే సిద్ధేశ్వర కల్యాణాన్ని రచించాడు. అంతేగాక, కృతిని సిద్ధేశ్వరునికే అంకితం చేయడమే మరొక ప్రమాణం. ఈ విషయాన్నే తన కావ్యం ద్వారా వ్యక్తీకరించాడు కూడా. పైగా
‘నుతి పురాతన నీతికతలకు మీఱి
నుతికెక్కు నూతన కతలనుగొన్ని
బ్రతుకు కై బ్రతిమాలి నుతులిచ్చి కవిత
నుతికెక్క లేనట్టి మతులైనగాని
చెప్పితి రాజుల చరితలు పూర్వ
మొప్పగా రాజ్యముల్ మొగి
చేసి సనిన చొప్పు చెప్పెద..”
అంటూ చెప్పుకున్న సర్వప్పకు కవిత్వశక్తి కొంత తక్కువే కావచ్చు కాని, ఆయన ధ్యేయం మాత్రం గొప్పది. ఈ విషయంలో ఎటువంటి సందేహానికి స్థానం లేదు. ఛందో సంబంధి విషయాల్లో, యతి మైత్రి వంటి అంశాల్లో, వ్యాకరణ నిబంధనలు, సంధి ప్రయోగాల్లో, అన్యదేశ్య శబ్ద ప్రయోగాల విషయంలో కొంత లోపం ఉండవచ్చు.
కాని, తన రచనలో తాను పుట్టిన నేలకు సంబంధించిన పలుకుబళ్లుసహా శబ్ద ప్రయోగాల్లోను స్థానికతకే పెద్దపీట వేశాడు. దీనివల్ల నేటికీ ప్రజల వ్యవహారాల్లో కనిపించే ఎన్నో శబ్దాలు ఈ కావ్యంలో కానవస్తాయి.
ఒక జాతి చరిత్రకు, ఓ రాజ్య వృత్తాంతానికి విశేష గ్రంథంగా వినుతికెక్కిన ‘సిద్ధేశ్వర చరిత్ర’ను తెలుగు వారికి ఎన్నెన్నో కొత్త పాఠాలను నేర్పించే కా వ్యంగా భావించాలి. కొత్త రీతుల్లో మన చరిత్రను మనకు విశదీకరించి, పరిగణించగలిగిన విశిష్ట రచనగానూ ఇది సాహి త్య చరిత్రలో నిలుస్తుంది. అందుకే, ఖం డవల్లి లక్ష్మీరంజనం ఈ కావ్యానికి ఆం గ్లంలో విస్తారంగా 90 పుటలకు పైగా పీఠిక రాశారు. తద్వార ఆయన చదువరులకు ఒక మార్గదర్శనం చేసి సర్వప్ప కవి ప్రతిభకు దర్పణం పట్టారు.
రసవత్తర రచన
‘సిద్ధేశ్వర చరిత్ర’లో వస్తువుగా చరిత్రనే స్వీకరించి కావ్య నిర్మాణం చేపట్టినా, శివపార్వతుల కల్యాణం విషయంలో మాత్రం ఆయన కొన్ని కల్పనలు, వర్ణనలు చేశాడు. దీంతోపాటు వివాహాల్లో పాటించే నాటి ఆచార వ్యవహారాలు, నిశ్చితార్థం, ముద్రారోహణం, పెళ్లి సంరంభం, ముత్తయిదువుల పాటలు,
హిమవంతుడు కూతురికి బుద్ధులు చెప్పడం వంటి ఎన్నెన్నో హృద్యమైన సందర్భాలను కవి ఈ కావ్యంలో పొందు పరిచాడు. చారిత్రక కావ్యాన్ని కూడా రసవంతమైన కావ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. దీనినిబట్టే సర్వప్ప కవికిగల వస్తు సేకరణ, దాని నిర్వహణా సామర్థ్యం, ప్రతిభా ప్రావీణ్యాలు అర్థమవుతున్నాయి.