09-04-2025 12:31:31 AM
కేసీఆర్ పూలే విగ్రహానికి ఏనాడూ నివాళులర్పించలేదు
ఈ నెల 11న ఫిలింనగర్‌లో పూలే జయంతి సభ
ఫూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌గా చిన్న శ్రీశైలం యాదవ్
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కవితకు పూలే పేరు పలికే అర్హత లేదని, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని అంటున్న ఎమ్మెల్సీ కవిత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎందుకు పెట్టలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఇప్పుడు అధికారం దిగిపోయాక కొత్త డ్రామాకు తెర తీశారని విమర్శించారు.
అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ కనీసం పూలే విగ్రహానికి ఏనాడూ నివాళ్లు అర్పించలేదన్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేషా చారీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ గా బీసీ కుల సంఘాల కో-చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్‌ను ఎన్నుకున్నారు. ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ధర్నా చౌక్‌ను ఎత్తేసిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీకి ఉందని, ఇప్పడు అదే ధర్నా చౌక్‌లో కవిత ధర్నాకు కూర్చోవడం విడ్డురంగా ఉందన్నారు. బిఆర్‌ఎస్ పార్టీలో బీసీ నాయకులు లేనట్టు, కవిత బీసీ నినాదం ఎత్తుకుందని, ప్రజలు ఆమె మాటలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌కు జ్యోతిరావు పూలే పేరు పెట్టి, తన నిబద్ధతను చాటుకుందన్నారు.
ఈనెల 11న ఫిలిమ్ నగర్ లో నిర్వహించే మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి ఉత్సవాలకు రాష్ట్ర నలు మూలల నుంచి తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. చదువే ఆయుధంగా పూలే ముందుకు సాగారని అన్నారు. ఈ జయంతి ఉత్సవాలకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఫిలిమ్ నగర్‌లో పూలే, సావిత్రి భాయ్ ఏడు అడుగుల విగ్రహాలు హాలు ఏర్పాటు చేసి, భారీ జయంతి సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేనందున తాము పెద్దెత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు ఎకరాల్లో పూలే స్మృతి వానం ఏర్పాటు చేసి, వారి భారీ విగ్రహాలతో పాటు పూలే నాలెడ్జి సేంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
త్వరలోనే రాష్ట్రంలోని ప్రతీ జిల్లా కేంద్రంలో పూలే విగ్రహాలు ఏర్పాటు చేస్తాం అన్నారు. పూలేకు వెంటనే భారత రత్న అవార్డు ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కులకచర్ల శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు కనకాల శ్యామ్ కుర్మా, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, శ్యామ్ పటేల్, భాస్కర్ గౌడ్ రాములు పాల్గొన్నారు.