- గతేడాది ప్రాజెక్ట్‌కు కట్టకు గండి
- ఏడాది దాటుతున్న గండి పూడ్చని ప్రభుత్వం
- పంట కాలువల్లో చేరుతున్న పూడిక
- సాగునీటి సౌకర్యం లేక రైతుల ఆందోళన
నిర్మల్, జూలై 20 (విజయక్రాంతి): ‘అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అనే చందంగా మారింది భైంసా మండలంలోని సిరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్వహణను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో 17 వేల ఎకరాల ఆయకట్టు ఎండుతోంది. కనీసం కాలువల మరమ్మతులు చేయకపోవడంతో అవి పూడిపోతున్నాయి. గత ఏడాది కురసిన భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరింది.
అలుగు, తూముల నుంచి నీరు బయటకువ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కట్టపై నుంచి వరద బయటకు వచ్చింది. కట్టకు గండి పడి పొలాల్లోకి వరద చేరింది. రైతులు పంట నష్టపోవాల్సి వచ్చింది. గండి పూడ్పించి కట్టను పటిష్టం చేసేందుకు నీటిపారుదలశాఖ అధికారులు గత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రూ.9.36 కోట్లు విడుదల చేయడంతో అధికారులు పనులకు డెండర్లను పిలిచారు.
కొన్ని పనులు ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు వానలు కురస్తున్నందునవ వాటికి బ్రేక్ పడింది. గత ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేస్తే ఇప్పటికి పనులు పూర్తయ్యేవని, తద్వారా ఆయకట్టుకు సాగునీరు అందేదని రైతులు వాపోతున్నారు. రెండుసార్లు పంటలు పండించుకొనే ఆవకాశం కోల్పోయినట్లు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వానకాలం ముగిసిన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. దీనిపై నీటి పారుదల శాఖ డీఈ అనిల్‌ను వివరణ కోరగా.. వానలు తగ్గగానే పనులను తిరిగి ప్రారంభించి, సకాలంలో పూర్తి చేస్తామన్నారు.