22-03-2025 02:10:58 AM
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): ధర్మ పరిరక్షకురాలు అహల్య దేవి 300వ జయంతి వేడుకలను పురస్కరించుకుని అహల్య దేవి జీవిత చరిత్రను ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈనెల 23న నగరంలో “రాష్ర్ట సమర్థ - అహల్యకీ పుణ్యగాధ” పేరిట నాటిక ప్రదర్శించనున్నారు.
కుటుంబ విలువల పరిరక్షణే ధ్యేయంగా విశ్వమాంగల్య సభ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ నాటిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వ మాంగళ్య సభ జాతీయ సహా సంఘటన కార్యదర్శి గాయత్రి లోమ్టే, హైదరాబాద్ నగర అధ్యక్షురాలు శృతి, కార్యదర్శి డాక్టర్ ఆశాజ్యోతి, సమన్వయకర్త డాక్టర్ పూనమ్ నోముల్వార్ వివరాలు వెల్లడించారు.
నాగపూర్‌కి చెందిన 45 మంది కళాకారుల బృందం ఈ నాటికను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దేశంలోని 51 ప్రాంతాల్లో నాటిక ప్రదర్శించనున్నారని, ఇప్పటికే 21 ప్రాంతాల్లో ప్రదర్శనలు పూర్తయ్యాయని వెల్లడించారు. సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రదర్శనకు పారిశ్రామికవేత్త భగవతిజీ మహేష్ బల్డ్వా, సంస్థ జాతీయ ఉపాధ్యక్షురాలు నళిని హావ్రే తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.