18-02-2025 11:26:06 PM
ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు..
అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రాణ నష్టం..
ప్రమాదంలో ఓ చిన్నారి సహా 18 మందికి గాయాలు..
కెనడాలోని టొరెంటో విమానాశ్రయంలో ఘటన..
టొరెంటో: కెనడాలోని టొరెంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 80 మందితో కూడిన విమానం దిగుతూ అదుపుతప్పి తలకిందులుగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 18 మంది గాయపడ్డారు. 76 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో అమెరికాలోని మిన్నెపోలిస్ నుంచి బయల్దేరిన డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన సీఆర్‌జే విమానం సోమవారం టొరెంటోలో దిగుతుండగా క్రాష్ ల్యాండై బోల్తాపడింది. దీంతో విమానానికి సంబంధించిన ఫ్యూజ్‌లేజ్ భాగంలో మంటలు చెలరేగి దట్టమైన పొగ వెలువడింది. అయితే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్టు టొరెంటో ఎయిర్‌పోర్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డెబోరా ఫ్లింట్ పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని అధికారులు వెల్లడించారు. అయితే విమానం దిగడానికి కొన్ని గంటల ముందు ఆ ప్రాంతంలో భారీ మంచు తుఫాను సంభవించింది. ఈ క్రమంలో రన్‌వే పై మంచు పేరుకుపోయింది. ఈ మంచు వల్లే విమానం అదుపుతప్పి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై డెల్టా సీఈఓ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన సిబ్బందిని అభినందించారు.